
Donald Trump: వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన.. ఓ గొప్ప దేశంతో డీల్ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించి వాణిజ్యపరంగా కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అయితే, ఆ తరువాత ఆయన వాణిజ్య ఒప్పందాల పట్ల సానుకూలంగా మారారు.
దేశాలు అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటేనే సుంకాల నుంచి విముక్తి పొందవచ్చని సూచిస్తూ, అందుకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజాగా ఆసక్తికర ప్రకటన చేశారు. ఓ గొప్ప దేశంతో భారీ స్థాయిలో ఒప్పందం జరగబోతోందంటూ ఓ హింట్ ఇచ్చారు.
వివరాలు
90 రోజుల వరకు టారిఫ్‌ల నుంచి తాత్కాలిక మినహాయింపు
''అమెరికా సమయానుసారం రేపు ఉదయం 10 గంటలకు ఓవల్ ఆఫీసులో ఎంతో ముఖ్యమైన మీడియా సమావేశం జరుగుతుంది. ప్రపంచంలో గౌరవనీయమైన, గొప్ప దేశంతో వాణిజ్య ఒప్పందం కుదరబోతోంది. ఆ దేశం ఇతర దేశాలకన్నా ముందంజలో ఉంది,'' అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్టు చేశారు.
అయితే, ట్రంప్ ప్రకటించిన ఈ దేశం ఏదన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఆసక్తి, ఉత్కంఠ పెరిగిపోయింది.
గతంలో ట్రంప్ భారత్, చైనా వంటి అనేక దేశాలపై భారీ టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే.
అయితే ఆ తర్వాత చైనాను మినహాయించి మిగిలిన కొన్ని దేశాలకు 90 రోజుల వరకు టారిఫ్‌ల నుంచి తాత్కాలిక మినహాయింపు కల్పించారు.
వివరాలు
'మెగా డీల్'
దీంతో అనేక దేశాలు అమెరికాతో వాణిజ్య చర్చల్లో పాల్గొన్నాయి.ఇదిలా ఉండగా, భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో అమెరికా త్వరలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనుందని ట్రంప్ పరిపాలన నుంచి ఇటీవల సూచనలు వెలువడ్డాయి.
ఇప్పుడు అధ్యక్షుడు 'మెగా డీల్' అనే మాట వినిపించడంతో, ఈ మూడు దేశాల్లో ఏదో ఒకదానితో ఒప్పందం ఖరారై ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలో అమెరికా-చైనా మధ్య వాణిజ్య విభేదాలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే.
ఈ పరిస్థితుల్లో ఇరుదేశాలు చర్చలకు సిద్ధమవుతున్నాయి.
వివరాలు
ఇరుదేశాలు చర్చలకు సిద్ధం
చైనాకు చెందిన అగ్రశ్రేణి ప్రతినిధుల బృందం, అమెరికా ఉన్నతాధికారులు ఈ వారంలో చివర్లో స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్, వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ లు జెనీవాలో చైనా అధికారులతో సమావేశం కానున్నట్లు అమెరికా ప్రకటించింది.
వినియోగ వస్తువుల ధరలు, సరఫరాలపై టారిఫ్‌ల ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.