LOADING...
SCO Summit: SCO శిఖరాగ్ర సమావేశానికి ఎస్ జైశంకర్.. వివిధ అంశాలపై చర్చ 
SCO శిఖరాగ్ర సమావేశానికి ఎస్ జైశంకర్.. వివిధ అంశాలపై చర్చ

SCO Summit: SCO శిఖరాగ్ర సమావేశానికి ఎస్ జైశంకర్.. వివిధ అంశాలపై చర్చ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2024
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

నేటి (మంగళవారం) నుంచి పాకిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడులు,జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేస్తున్న నిరసనల కారణంగా శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారుతుందనే భయంతో ఈ రెండు రోజుల పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు విదేశీ ప్రతినిధులు ఇప్పటికే చేరుకున్నారు. భారతదేశం తరపున విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ SCO సదస్సులో పాల్గొంటారు.

వివరాలు 

కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఛైర్మన్‌గా షెహబాజ్ షరీఫ్

చైనా, రష్యా ప్రధాన మంత్రులతో సహా SCO సభ్య దేశాల నేతలు బెలారస్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రధానులతో పాటు ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ కూడా సదస్సుకు రానున్నారు. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) సమావేశంలో ఆర్థిక, వాణిజ్య, పర్యావరణం వంటి వివిధ అంశాలపై చర్చించనున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ప్రస్తుత కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఛైర్మన్‌గా ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రష్యా నుంచి 76 మంది,చైనా నుంచి 15 మంది,భారత్ నుంచి నలుగురు,కిర్గిస్థాన్ నుంచి నలుగురు,ఇరాన్ నుంచి ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకున్నాయి.

వివరాలు 

రాజకీయ సమావేశాలు, నిరసనలు నిషేధం 

11 సంవత్సరాల తర్వాత చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సుకు తొలిసారిగా పర్యటిస్తున్నారు. మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు, పారామిలటరీ బలగాలు, ఆర్మీ బలగాలను మోహరించారు. ఇస్లామాబాద్‌లో అన్ని రకాల రాజకీయ సమావేశాలు, నిరసనలను స్థానిక ప్రభుత్వం నిషేధించింది.