
Taiwan: తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు.. 153 యుద్ధ విమానాలు చక్కర్లు
ఈ వార్తాకథనం ఏంటి
తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.
తైవాన్ రక్షణశాఖ సమాచారం ప్రకారం, 153 చైనా మిలిటరీ విమానాలు తైవాన్ గగనతలానికి సమీపంలో చక్కర్లు కొట్టాయి.
ఈ ఘటన మంగళవారం ఉదయం 6 గంటల వరకు జరిగింది. ఈ సమయంలో 14 చైనా నౌకలు కూడా తైవాన్ సముద్ర జలాల్లో కనిపించాయి.
తైవాన్ రక్షణశాఖ చైనా ఈ చర్యలను అసహనపూరితంగా, అసమంజసంగా అభివర్ణించింది.
చైనా గతంలో ఒకేరోజు ఇంత భారీగా సైనిక విన్యాసాలు చేపట్టిన సందర్భాలు లేవని, ఇది పూర్తిగా రెచ్చగొట్టే చర్య అని అధికారులు ఆరోపించారు.
చైనా సైనిక విన్యాసాలు జపాన్ యోనాగుని ద్వీపం సమీపంలో జరగడంతో, జపాన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
Details
స్పందించిన అమెరికా
జపాన్ డిప్యూటీ చీఫ్ కేబినెట్ సెక్రటరీ కజుహికో అయోకి, తమ దేశంపై చైనా తీసుకుంటున్న చర్యలను జపాన్ నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై అమెరికా కూడా స్పందించింది. చైనా చర్యల వల్ల ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బీజింగ్ సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. సోమవారం జరిగిన ఈ సైనిక విన్యాసాలను చైనా సైన్యం "జాయింట్ స్వార్డ్-2024బి" పేరుతో నిర్వహించింది.
ఆర్మీ, నేవీ, వాయుసేన, క్షిపణి బలగాలను సమీకరించి, తైవాన్ చుట్టూ అన్నివైపుల నుంచి దిగ్బంధించినట్లుగా ఈ విన్యాసాలు సాగాయి.
పీఎల్‌ఏ సీనియర్ కెప్టెన్ లీ షీ ఓ ప్రకటన ప్రకారం, ఈ విన్యాసాలు తైవాన్‌కు స్పష్టమైన హెచ్చరికగా చేపట్టినవని తెలిపారు.