Page Loader
PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ
ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ

PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు మూడో విడతలో మరింత ఉన్నత లక్ష్యాలను చేరేందుకు కృషి చేస్తున్నామని,ఈ దిశగా మూడు రెట్లు శక్తితో ముందుకు వెళ్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత్‌ ప్రస్తుతం అవకాశాల దేశంగా మారిందని తెలిపారు.న్యూయార్క్‌లో నస్సావ్‌ వెటరన్స్‌ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 13,000 మంది హాజరయ్యారు.''మేము అత్యంత క్లిష్టమైన,సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశాం.ఈ ఎన్నికల్లో అసాధారణ పరిణామం చోటు చేసుకుంది.'అబ్‌ కీ బార్‌ మోదీ సర్కార్‌'(మరోసారి మోదీ ప్రభుత్వం)వచ్చింది. "నెహ్రూ పాలన అనంతరం 60 ఏళ్లలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు విశేష ప్రాధాన్యం ఉంది'' అని మోదీ అన్నారు.

వివరాలు 

సుపరిపాలనకు అంకితం

సుపరిపాలన,సమృద్ధి చెందిన భారత్‌ను సాధించడానికి తన జీవితాన్ని అంకితం చేశానని మోదీ తెలిపారు. తనను విధి రాజకీయాల వైపు తీసుకెళ్లిందని, సీఎం లేదా ప్రధాని అవుతానని ఎన్నడూ ఊహించలేదని అన్నారు. గత పదేళ్లలో తన సుపరిపాలనను గుర్తించి ప్రజలు మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చారని వివరించారు. సంస్కృత శ్లోకాన్ని ఉటంకిస్తూ, త్యాగం చేసే వారు మాత్రమే ఫలాలను పొందుతారని చెప్పారు. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా వారి కృషి ద్వారా సామాజిక, దేశాభివృద్ధికి సహకరిస్తారని పేర్కొన్నారు. భారతీయ అమెరికన్ల కృషి దేశాన్ని గర్వపడేలా చేస్తోందని ఆయన కొనియాడారు.

వివరాలు 

140 కోట్ల మంది గౌరవం 

''డెలావేర్‌లోని తన ఇంటికి శనివారం అధ్యక్షుడు జో బైడెన్‌ నన్ను తీసుకెళ్లారు. ఆయన ప్రేమ, వాత్సల్యం నా మనసును స్పృశించింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. ప్రవాస భారతీయుల విజయాల వల్లనే ఈ గౌరవం సాధ్యమైంది'' అని మోదీ తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న వేల మంది ప్రవాస భారతీయులు భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారని అన్నారు. భారత్‌, అమెరికా కలిసి ప్రజాస్వామ్య వేడుకలో భాగస్వాములయ్యాయని తెలిపారు. ''ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అని అర్థం. కానీ నా దృష్టిలో ఏఐ అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి. మీరు (ప్రవాస భారతీయులు) భారత్‌, అమెరికాలను అనుసంధానం చేస్తున్నారు. మీ ప్రతిభ, నైపుణ్యం, నిబద్ధత ప్రపంచంలో అసమానమైనవి.

వివరాలు 

2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ లక్ష్యం 

భిన్నత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం, ఎందుకంటే అది మన రక్తంలో, సంస్కృతిలో ఉంది. 2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించడానికి గట్టి లక్ష్యంతో కృషి చేస్తున్నాం. కోట్లు మంది భారతీయుల ఆకాంక్షలే అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి'' అని మోదీ పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల సదస్సులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరిలో 117 మంది కళాకారులు తమ కళా ప్రదర్శనల ద్వారా ప్రతినిధులను స్వాగతించారు.

వివరాలు 

మోదీ సమక్షంలో  దేవిశ్రీ ప్రసాద్ "నమస్తే ఇండియా" పాట 

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 'పుష్ప-1' సినిమా నుండి 'శ్రీవల్లి' పాటతో కార్యక్రమంలో హాజరైన వారిని ఉత్సాహపరిచారు. ఆయన గానం చేస్తున్న 'హర్‌ ఘర్‌ తిరంగా' పాటతో ప్రధాని నరేంద్ర మోదీ వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో హాల్ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ "నమస్తే ఇండియా" అంటూ ప్రవాస భారతీయులను సాదరంగా పలకరించడమేకాకుండా, మోదీ సమక్షంలో తన పాటను కొనసాగించారు. అనంతరం, మోదీ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాఢ్వీ మరియు ఇతర కళాకారులను అభినందించారు.