LOADING...
Jaishankar: 'మా కంటే చైనానే ఎక్కువ కొంటోంది'.. రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్‌
'మా కంటే చైనానే ఎక్కువ కొంటోంది'.. రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్‌

Jaishankar: 'మా కంటే చైనానే ఎక్కువ కొంటోంది'.. రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్‌పై విధించిన సుంకాల అంశంపై విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మాస్కో వేదికగా స్పందించారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసే దేశం భారత్ కాదని,ఆ స్థానం చైనాదేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే, రష్యా నుంచి ఎల్పీజీని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని,ఐరోపా యూనియన్‌ ప్రధానంగా దిగుమతులు జరుపుతోందని వివరించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో ఉన్న జైశంకర్‌ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలసి చర్చలు జరిపారు. అనంతరం ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో భేటీ అయ్యారు.

వివరాలు 

అమెరికా సుంకాలపై తీవ్రంగా స్పందించిన జైశంకర్‌

ఈ భేటీ తర్వాత జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జైశంకర్‌ అమెరికా సుంకాలపై తీవ్రంగా స్పందించారు. ప్రపంచ ఇంధన ధరలను స్థిరపరచడానికి భారత్‌ సహకారం అందించాలని అమెరికా స్వయంగా కోరిందని,రష్యా నుంచి చమురు దిగుమతి చేయాలని కూడా అగ్రరాజ్యం సూచించిందని ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, 2022 తర్వాత రష్యాతో అత్యధిక వాణిజ్యం జరిపిన దేశం భారత్‌ కాదని కూడా స్పష్టంచేశారు. అయినప్పటికీ భారత్‌పైనే భారీ సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావడం లేదని జైశంకర్‌ అభిప్రాయపడ్డారు.