
Ayatollah Ali Khamenei: ఎట్టి పరిస్థితిలోనూ అమెరికాకు లొంగం: అయతొల్లా అలీ ఖమేనీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మళ్లీ అమెరికా,ఇజ్రాయెల్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా తమను వశం చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన మండిపడి, అలాంటి ఒత్తిళ్లకు ఎదుర్కొనేందుకు భాగస్వామ్య దేశాలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. "ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా ఎదుట తల వంచేది లేదు" అని ఖమేనీ స్పష్టంగా ప్రకటించారు. తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ప్రకటనలో,జూన్‌లో తమ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్‌లు జరిపిన దాడులు తామెదురుదాడులకు దిగేలా చేశాయని వివరించారు. తెహ్రాన్‌ను అస్థిరపరచాలనే ఉద్దేశంతోనే అమెరికా పన్నాగాలు పన్నుతోందని ఆరోపించిన ఆయన, ఇజ్రాయెల్ దాడి తర్వాత వెంటనే అమెరికా ఏజెంట్లు యూరప్‌లో సమావేశమై, ఇరాన్ ప్రభుత్వంపై చర్చలు జరిపారని తెలిపారు.
వివరాలు
బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలతో అణు చర్చల కోసం సమావేశం కానున్న ఇరాన్
అమెరికా అసలు ఆశయం ఇరాన్‌ను తమకు లోబడి ఉండే దేశంగా మలచడమేనని ఆయన విమర్శించారు. దేశం లోపల సైన్యం, ప్రభుత్వం, ప్రజలు అందరూ ఒకే తాటిపై నిలిచి శత్రువులకు గట్టి హెచ్చరిక ఇచ్చారని అయతొల్లా పేర్కొన్నారు. ఇరాన్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రపంచం మొత్తం గమనించిందని, దీనివల్ల అనేక దేశాలు ఇరాన్ పట్ల మరింత గౌరవం చూపుతున్నాయని తెలిపారు. అంతర్గత విభేదాలను విదేశీ శక్తులు ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇక మరోవైపు, ఇరాన్ మంగళవారం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలతో అణు చర్చల కోసం సమావేశం కానుంది. ఈ పరిణామాల నడుమ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి.