
Israel-Hamas: టెల్‌అవీవ్ మరోసారి గాజాపై వైమానిక దాడి.. గాజాలో 32 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిస్తున్న అప్రతిహత వైమానిక దాడుల కారణంగా పలస్తీనా ప్రజలు తీవ్రంగా బాధలు పడుతున్నారు.
తాజాగా టెల్ అవీవ్ బలగాలు గాజా పట్టణంపై ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించాయి.ఈదాడులలో 32 మంది పాలస్తీనా నివాసితులు మరణించారని అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు.
మృతుల్లో అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొన్నారు.
దీనికి ప్రతీకారంగా హమాస్ ఇజ్రాయెల్ పట్టణాలపై రాకెట్ దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో అనేక భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఇజ్రాయెల్ తరచుగా చేస్తున్న దాడుల కారణంగా గాజాలో ఆహార, ఔషధాల కొరత ఏర్పడిందని, రోజుకొక రీతిలో పరిస్థితులు విషమిస్తుండటంతో ఆ ప్రాంతంలో మానవతా విపత్తు నెలకొంటుందని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
55 మంది పలస్తీనా పౌరులు మృతి
ఈ వారం గాజా, సిరియాపై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మొత్తం 64 మంది మృతిచెందినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఈలోగా గాజాలో మాత్రమే 55 మంది పలస్తీనా పౌరులు మరణించారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది, 5 మంది పసిపిల్లలు, 4 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారని సమాచారం.
హమాస్‌తో గత 17 నెలలుగా జరుగుతున్నఘర్షణలో ఈ ఏడాది ప్రారంభం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది.
అయితే, ఈ ఒప్పందంలో మార్పులు చేసేందుకు హమాస్ నిరాకరించడంతో, దాడులు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించినట్లు తెలుస్తోంది.
వివరాలు
నెతన్యాహు నాలుగోసారి వాషింగ్టన్ పర్యటన
ఇటీవల ఆయన మీడియాకు ఇచ్చిన ప్రకటనలో, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడమే తమ దాడులకు కారణమని స్పష్టంగా తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో, నేడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్న సందర్భంలో గాజాపై ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న వరుస దాడులు ప్రాధాన్యత పొందాయి.
ఈ సమావేశంలో, హమాస్‌పై యుద్ధం, బందీల విడుదల, ఇరాన్ అణుప్రయోగ సంక్షోభం, అలాగే అమెరికా విధించిన 17 శాతం టారిఫ్‌లపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
గాజాలో యుద్ధం మొదలైన తర్వాత నెతన్యాహు నాలుగోసారి వాషింగ్టన్ పర్యటనకు వెళ్లడం ఇది.