LOADING...
MAX app: వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా కొత్త మాక్స్‌ యాప్‌  
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా కొత్త మాక్స్‌ యాప్‌

MAX app: వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా కొత్త మాక్స్‌ యాప్‌  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
07:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న పలు యాప్‌లపై కొన్ని దేశాలు నిషేధాలు విధిస్తున్నాయి. చైనా ఈ క్రమంలో ముందే వాట్సాప్‌ వంటి యాప్‌ల వినియోగాన్ని ఆపేసింది. అక్కడి ప్రజలకు 'వీచాట్‌' వంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే బాటలో రష్యా కూడా నడుస్తోంది. అయితే రష్యా వాట్సాప్‌ను నిషేధించకపోయినా, దానికి ప్రత్యామ్నాయంగా 'మాక్స్‌ (MAX)' అనే కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ యాప్‌ వినియోగాన్ని మరింత పెంచే దిశగా కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది.

వివరాలు 

 'మాక్స్‌'ను ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌గా ఉంచాలని అధికారిక ఆదేశాలు

విదేశీ డిజిటల్‌ సేవలపై ఆధారపడకుండా స్వదేశీ యాప్‌లను అభివృద్ధి చేయడం,వాటిని బలోపేతం చేయడం రష్యా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ ఆలోచనలో భాగంగానే వాట్సాప్‌ స్థానంలో మాక్స్‌ యాప్‌ ప్రాచుర్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇకపై రష్యాలో తయారయ్యే ప్రతి మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్లెట్‌లో 'మాక్స్‌'ను ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌గా తప్పనిసరిగా ఉంచాలని అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌గా వస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు వాటిలో మాక్స్‌ను కూడా చేర్చనుంది. అంతేకాకుండా, ప్రభుత్వ సేవలను కూడా ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు పొందగలరని అధికారులు స్పష్టం చేశారు. ఈ యాప్‌ను ప్రభుత్వరంగ సంస్థ 'వీకే' (VK) రూపొందించిందని సమాచారం.అందువల్ల వినియోగదారుల డేటాపై ప్రభుత్వం నిఘా పెట్టే అవకాశం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

వివరాలు 

'రూ స్టోర్‌'ను  ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌ల జాబితాలో చేర్చాలని నిర్ణయం 

అయితే రష్యా ప్రభుత్వం ఈ విమర్శలను ఖండించింది. వాట్సాప్‌, టెలిగ్రామ్‌లతో పోలిస్తే మాక్స్‌ యాప్‌కు పరిమిత యాక్సెస్‌ మాత్రమే ఉంటుందని, వినియోగదారులపై గూఢచర్యం చేసే అవకాశం లేదని అధికారికంగా వెల్లడించింది. మాక్స్‌ యాప్‌తో పాటు, సెప్టెంబర్‌ 1 నుంచి రష్యాలో ఉత్పత్తి అయ్యే ఆపిల్‌ ఫోన్లలో దేశీయ యాప్‌స్టోర్‌ 'రూ స్టోర్‌ (RuStore)'ను కూడా తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌ల జాబితాలో చేర్చాలని నిర్ణయించారు. అంతేకాక, వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కొత్తగా తయారయ్యే టెలివిజన్లలో 'లైమ్‌ హెచ్‌డీ టీవీ' (Lime HD TV) యాప్‌ను కూడా కచ్చితంగా ప్రీ-ఇన్‌స్టాల్‌ చేయాలని రష్యా ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వ టీవీ ఛానళ్లను ఉచితంగా ప్రజలకు ప్రసారం చేసే అవకాశం లభించనుంది.