
Donald Trump:టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు.. చైనా విషయంలో అసలు తగ్గేదే లేదు: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా విధించిన టారిఫ్ నుంచి ఏ దేశానికి మినహాయింపు లభించదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
ముఖ్యంగా చైనాకు ఎటువంటి రాయితీ వర్తించదని ఆయన ఖచ్చితంగా ప్రకటించారు.
తాను చేపట్టిన కఠినమైన వాణిజ్య విధానాన్ని ఆదివారం మరోసారి ఆయన పునరుద్ఘాటించారు.
''అసమాన వాణిజ్య మిగులు కలిగిన దేశాలు,అలాగే నాన్ మానిటరీ టారిఫ్ అడ్డంకులు పెడుతున్న దేశాలకు ఏ దేశానికి మినహాయింపు లభించదు. ముఖ్యంగా చైనా లాంటి దేశానికి మినహాయింపు ఇవ్వబడదు. ఆ దేశం మాతో అన్యాయంగా,హేయంగా వ్యవహరించింది.శుక్రవారం రోజున ఎటువంటి మినహాయింపు టారిఫ్‌లు ప్రకటించలేదు. కొన్ని ఉత్పత్తులు 20 శాతం ఫెంటనిల్ పన్ను పరిధిలోకి వచ్చాయి. అవి కేవలం ప్రత్యేక టారిఫ్ విభాగంలోకి చేర్చబడ్డాయి అంతే'' అని ట్రంప్ వివరించారు.
వివరాలు
చైనా ఆధీనంలో ఉన్నట్లుగా ఉండేవాళ్ళం
మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించే వారికి ఈ నిజం బాగా తెలుసు,కానీ ఆ నిజాన్ని వారు బహిర్గతం చేయరు అని ట్రంప్ ఆరోపించారు.
త్వరలోనే ప్రారంభం కానున్న జాతీయ టారిఫ్ దర్యాప్తులో సెమీకండక్టర్‌లు,మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాలపై సమీక్ష జరుగుతుందని తెలిపారు.
ఆ దర్యాప్తు నివేదికల ఆధారంగా, ఈ సామగ్రిని దేశీయంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని తేలిందని అన్నారు.
ఇదివరకు మనం చైనా ఆధీనంలో ఉన్నట్లుగా ఉండేవాళ్లమని, కానీ ఇకపై అలా కొనసాగదు అని స్పష్టం చేశారు.
చైనా అన్ని అవకాశాలను వాడుకుని అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయాలని చూస్తుందని, అలాంటి వ్యవహారాన్ని ఇకపై ఊహించాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆ రోజులు ముగిశాయని, ఇప్పుడు అమెరికా స్వర్ణయుగం మొదలైందని అన్నారు.
వివరాలు
మేక్ అమెరికా గ్రేట్ అగైన్
భవిష్యత్తులో పన్నులు,నియంత్రణలపై పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించబడతాయని తెలిపారు.
ఇకపై ఇతర దేశాలపై ఆధారపడకుండా, మన దేశంలోనే ఉత్పత్తులను చేయాలని, గతంలో చైనా మనపై ఎలా వ్యవహరించిందో ఇప్పుడు మనం కూడా ఆ విధంగానే స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.
''చివరగా చెబేది ఏంటంటే, మన దేశాన్ని ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా బలమైనదిగా, గొప్పదిగా, మెరుగైనదిగా తీర్చిదిద్దబోతున్నాం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (Make America Great Again)'' అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా వ్యాఖ్యానించారు.
వివరాలు
కొత్త టారిఫ్‌లు సిద్ధం అవుతున్నాయి..
అంతేకాకుండా, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆదివారం మాట్లాడుతూ, ట్రంప్ పరిపాలన ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇచ్చిన మినహాయింపులు తాత్కాలికమైనవే అని అన్నారు.
రెండు నెలల్లోపు సెమీకండక్టర్లపై కొత్త టారిఫ్‌లు ప్రకటించే అవకాశముందని వివరించారు.
ఈ ఉత్పత్తుల తయారీ కేంద్రాలను అమెరికాలోకే మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
''సెమీకండక్టర్లు, చిప్స్, ఫ్లాట్ ప్యానల్స్ వంటి కీలక ఎలక్ట్రానిక్ భాగాలు అమెరికాకు అత్యవసరంగా అవసరమవుతున్నాయి. ఈ రంగాలు అమెరికా అభివృద్ధికి కీలకం. అయితే, అవసరమైన వస్తువుల కోసం మేము పూర్తి స్థాయిలో ఆగ్నేయాసియా దేశాలపై ఆధారపడదలుచుకోవట్లేదు. అందుకే ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల నుంచి కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చి, వాటిని సెమీకండక్టర్ పన్నుల పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారని'' మంత్రి లుట్నిక్ వెల్లడించారు.