భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బైడెన్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సందర్భంగా ఇరు దేశాధినేతలు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. బైడెన్ దంపతులకు మోదీ ఇచ్చిన బహుమతులు చాలా ప్రత్యేకంగా నిలిచాయి. ప్రతి బహుమానంలో భారతీయత ఉట్టిపడేలా ప్రధాని మోదీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చందనం పెట్టె రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మాస్టర్ క్రాఫ్ట్‌మ్యాన్ చేతితో తయారు చేసిన ప్రత్యేక గంధపు పెట్టెను జో బైడెన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఈ చెక్కను కర్ణాటకలోని మైసూర్ నుంచి సేకరించారు. గంధపు చెక్కపై వృక్షజాలం, జంతుజాలం ఆకృతులను చెక్కారు.
గణేశుడి వెండి విగ్రహం, శ్లోకం రాసిన ఉన్న తామ్ర పత్రం
చందనం పెట్టే, గణేశుడి వెండి విగ్రహం, నూనె దీపం, రాగి ఫలకంతో పాటు మొత్తం పలు రకాల విభిన్న బహుమతులను మోదీ అందజేశారు. బహుమతులను అందిస్తూ బైడెన్‌కు వాటి విశిష్టతను మోదీ వివరించారు. 1.కోల్‌కతాకు చెందిన కళాకారుల కుటుంబం తయారు చేసిన వెండి గణేశుడి విగ్రహాన్ని బైడెన్‌కు అందించారు. 2.ప్రతి హిందూ కుటుంబంలో పవిత్రంగా భావించే వెండి నూనె దీపం అందజేశారు. 3.శ్లోకం రాసి ఉన్న రాగితో చేసిన తామ్ర పత్రాన్ని అందించారు. 4.పశ్చిమ బెంగాల్‌లోని నైపుణ్యం కలిగిన కళాకారులు తయారు చేసిన వెండి కొబ్బరికాయను మోదీ అందజేశారు. గోవు స్థానంలో వెండి కొబ్బరికాయను సమర్పించారు. 5.భూ దానంలో భాగంగా భూమి స్థానంలో కర్ణాటకలోని మైసూర్ నుంచి సేకరించిన సువాసనగల గంధపు ముక్కను అందజేశారు.
తమిళనాడు తెల్ల నువ్వులు, జార్ఖండ్ సిల్క్ క్లాత్
6.తమిళనాడు నుంచి తీసుకొచ్చిన తెల్ల నువ్వులను బైడెన్‌కు ఇచ్చారు. 7.బంగారం దానంలో భాగంగా రాజస్థాన్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన 24కే స్వచ్ఛమైన హాల్‌మార్క్ ఉన్న స్వర్ణ నాణేన్ని అందించారు. 8.వెన్న దానంలో భాగంగా పంజాబ్ నుంచి సేకరించిన స్వచ్ఛమైన వెన్నను బైడెన్‌కు అందజేశారు. 9.వస్త్రదానంలో భాగంగా జార్ఖండ్‌లో చేతితో నేసిన టస్సార్ సిల్క్ క్లాత్‌ను బైడన్‌కు ఇచ్చారు. 10.ధాన్య దానంలో భాగంగా ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చిన పొడవాటి బియ్యం అందించారు. 11.వెండి దానంలో భాగంగా 99.5 శాతం, హాల్‌మార్క్ ఉన్న వెండి నాణేన్ని అందజేశారు. 12.బెల్లం దానంలో భాగంగా మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన బెల్లాన్ని అందించారు. 13.ఉప్పు దానంలో భాగంగా గుజరాత్ నుంచి తీసుకొచ్చిన లవణాన్ని ఇచ్చారు.
'ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషద్' పుస్తకాన్ని బైడెన్‌కు అందజేసిన మోదీ
ఐరిష్ కవి విలియం బట్లర్ యేట్స్ అంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు చాలా ఇష్టం. అందుకే సమయం వచ్చినప్పుడు యేట్స్ కవిత్వాన్ని బైడెన్ తరుచూ ఉటంకిస్తుంటారు. భారతీయ ఉపనిషత్తుల ఆంగ్ల అనువాదాన్ని 1937లో శ్రీ పురోహిత్ స్వామితో కలిసి యేట్స్ అనువదించారు. లండన్‌కు చెందిన ఫేబర్ అండ్ ఫేబర్ లిమిటెడ్ ప్రచురించిన ఈ ఆంగ్ల అనువాదం మొదటి ముద్రణ 'ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషద్' కాపీ సేకరించారు. దీన్ని గ్లాస్గో యూనివర్సిటీ ప్రెస్‌లో ముద్రించి బైడెన్‌కి ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు.
జో బైడెన్‌కు బహుమతిగా విశిష్టమైన 7.5 క్యారెట్ ఆకుపచ్చ వజ్రం
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు ల్యాబ్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన 7.5క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. ఈ వజ్రం పర్యావరణ అనుకూలమైనది. ఎందుకంటే సౌర, పవన శక్తి వంటి పర్యావరణ వైవిధ్య వనరులను ఈ వజ్రం తయారీలో ఉపయోగించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కచ్చితత్వంతో ఈ వజ్రాన్ని తీర్చిదిద్దారు. ఇది ప్రతి క్యారెట్‌కు 0.028 గ్రాముల కార్బన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. అంతేకాదు ఈ వజ్రానికి ఐజీఐ ట్యాగ్ కూడా వచ్చింది. భారతదేశం 75సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా మోదీ 7.5గ్రాముల వజ్రాన్ని అందజేశారు. అలాగే వజ్రాన్ని భద్రపర్చడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పేపియర్ మాచే( వెండి పెట్టె)ను కూడా మోదీ బహుమతిగా అందజేశారు.