USA: పనామా హోటల్‌లో భారతీయులతో సహా దాదాపు 300 మంది అక్రమ వలసదారులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా (USA) నుంచి తరలిస్తున్న భారతీయులు (Indian Migrants) సహా వివిధ దేశాల అక్రమ వలసదారులను తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు పనామా (Panama) ప్రకటించింది.
వీరందరికీ ప్రత్యేకంగా ఒక హోటల్‌లో వసతి ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
అయితే, వారిలో సుమారు 40 శాతం మంది తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని అక్కడి అధికారులు తెలిపారు.
పనామా మంత్రి ఫ్రాంకా అబ్రెగో ప్రకారం, దాదాపు 300 మంది వలసదారులు ఇప్పటికే తమ దేశానికి చేరుకున్నారు.
వీరంతా భారత్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ తదితర దేశాలకు చెందిన వారని పేర్కొన్నారు.
ఈ వలసదారుల తరలింపు సంబంధిత ఖర్చును అమెరికా భరించనుందని స్పష్టంచేశారు.
వివరాలు
వలసదారులు ఉన్న హోటల్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో..
ఇదిలా ఉండగా, బహిష్కరణకు గురైనవారిని హోటల్‌లో నిర్బంధించారన్న ఆరోపణలపై వివాదం చెలరేగింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కొన్ని చిత్రాలకు స్పష్టతనిస్తూ మంత్రి అబ్రెగో స్పందించారు.
వలసదారులు ఉన్న హోటల్ పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహించబడుతున్నదని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో లాటిన్ అమెరికా పర్యటన చేశారు.
ఈ సందర్భంగా గ్వాటమాల, పనామా దేశాలతో వలసదారుల తరలింపుపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
గత వారం 119 మంది చైనా, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ వలసదారులను పనామాకు తరలించారు. అయితే, గ్వాటమాలకు అమెరికా వలసదారులను ఇప్పటివరకు పంపించలేదని సమాచారం.
వివరాలు
అక్రమ వలసదారులపై కఠిన చర్యలు
అంతేకాదు, కోస్టారికాతో కూడా అమెరికా ఇలాంటి ప్రతిపాదనలే చేసుకుంది. భారతీయులతో సహా దాదాపు 200 మంది ఆసియా దేశాల వలసదారులు కోస్టారికాలోకి ప్రవేశించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇటీవల 112 మంది భారతీయులను సైనిక విమానంలో తరలించి, అమృత్‌సర్‌కు రప్పించారు.
ఇది ఇప్పటివరకు మూడో విమానం కాగా, ఇప్పటికే రెండు విమానాల ద్వారా భారతీయులను పంపించారు.