Page Loader
US: 'శాంతిని నెలకొల్పినందుకు' ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన నెతన్యాహు
US: ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన నెతన్యాహు

US: 'శాంతిని నెలకొల్పినందుకు' ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన నెతన్యాహు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్హుడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్రంప్‌ పేరును నామినేట్ చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా నెతన్యాహు సోమవారం వైట్‌హౌస్‌కి వచ్చారు. అక్కడ ట్రంప్‌ను కలిసిన ఆయన, బ్లూ రూమ్‌లో జరిగిన సమావేశంలోనే ఈ నామినేషన్‌ను అందజేశారు. శాంతి స్థాపన కోసం ట్రంప్ తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన కృషి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

వివరాలు 

మూడు విడతలుగా సమావేశాలు 

నెతన్యాహు నామినేషన్ లేఖను అందజేయగానే ట్రంప్ ఆశ్చర్యానికి గురయ్యారు. ''మీ నుంచి ఈ మద్దతు రావడం నాకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు'' అని ట్రంప్ స్పందించారు. ఇదిలా ఉండగా, ఇటీవలే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కూడా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. నెతన్యాహు పర్యటన సందర్భంగా మూడు విడతలుగా సమావేశాలు జరిగాయి. ట్రంప్‌తో సమావేశాల్లో గాజా పరిణామాలు, బందీల విడుదలపై పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిళ్లు తదితర అంశాలపై చర్చలు జరిగాయని సమాచారం. ముఖ్యంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెలీ బందీల విడుదలకు సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

వివరాలు 

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నిలిపేందుకు ప్రయత్నాలు 

అంతేకాకుండా, నెతన్యాహు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశాలన్నీ వైట్‌హౌస్ సమీపంలోని బ్లెయిర్ హౌస్‌లో జరిగాయని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా, ట్రంప్ తన పదవీకాలంలోనే లేదా అనంతరం తీసుకున్న కొన్ని కీలక చర్యల వల్ల ప్రపంచ శాంతి దిశగా ప్రభావం చూపించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నిలిపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా, అవి ఫలించలేదని సమాచారం. అయితే గతంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలకపాత్ర వహించినట్లు ట్రంప్ ప్రకటించారు.

వివరాలు 

హమాస్-ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ

అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని సాధించారంటూ ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో హమాస్-ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ అమలులో ఉందని తెలిపారు. ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో ఉంచుకుని ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నట్లు నెతన్యాహు స్పష్టంచేశారు.