LOADING...
Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా "రన్‌వే"లు రిపేర్ చేసుకుంటున్న పాక్..!
భారత్ దెబ్బకు ఇంకా "రన్‌వే"లు రిపేర్ చేసుకుంటున్న పాక్..!

Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా "రన్‌వే"లు రిపేర్ చేసుకుంటున్న పాక్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాక్‌కు గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు ఇప్పటికీ పాకిస్థాన్‌ తేరుకోలేకపోతుంది. ఆపరేషన్‌కు రెండు నెలలు గడిచినా.. పాకిస్థాన్‌లోని వ్యూహాత్మక ప్రాధాన్యమైన రహీమ్ యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ (Rahim Yar Khan Air base) వద్ద ఉన్న ఏకైక రన్‌వే ఇంకా సాధారణ వాడుకకు అందుబాటులోకి రాలేదు. దాని మూసివేతను పాక్‌ మూడోసారి పొడిగించింది. తాజాగా జారీ చేసిన నోటమ్‌ (Notice to Airmen) ప్రకారం.. రన్‌వే ఆగస్టు 5 వరకు మూసివేయనున్నట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. విమానయాన కార్యకలాపాలు నిలిపివేయబడతాయని తెలిపింది. అయితే రన్‌వే మూసివేతకు కారణాలేమిటో మాత్రం వెల్లడించలేదు.

వివరాలు 

మూడోసారి నోటమ్‌.. ఆగస్టు 5 వరకు గడువు 

మే 10న భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా జరిగిన దాడి తర్వాత తొలి నోటమ్‌ జారీ అయింది. దీంతో పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఈ కీలక ఎయిర్‌బేస్‌ ఒక్క వారం పాటు అందుబాటులో ఉండదని ప్రకటించారు. ఆ తర్వాత జూన్‌ 4న రెండో నోటమ్‌ జారీ చేశారు. ఆ సమయంలో రన్‌వే మూసివేతను జూలై 4 వరకు పొడిగించారు. తాజాగా ఆ గడువును మళ్లీ పొడిగిస్తూ ఆగస్టు 5 వరకు తీసుకెళ్లారు. భారత దాడుల కారణంగా రన్‌వేపై భారీ గోతులు ఏర్పడినట్లు కొన్ని పాక్‌ మీడియాలో ప్రచారమైన చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాకుండా రన్‌వే సమీపంలోని ఓ భవనం కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

వివరాలు 

 'ఐసీయూలో రహీమ్ యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌: మోదీ 

ఈ రహీమ్ యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌లో షేక్‌ జాయెద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కూడా ఉంది. దీంతో పాకిస్థాన్‌ దీనిని మిలిటరీ, సివిలియన్‌ కార్యకలాపాలకు రెండూ వాడుతోంది. భారత దాడుల్లో ఈ ఎయిర్‌బేస్‌తో పాటు మరో 10 మిలిటరీ స్థావరాలను కూడా టార్గెట్‌ చేసినట్లు సమాచారం. ఈ దాడుల తరువాతే పాక్‌ నెమ్మదించిందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ ఎయిర్‌బేస్‌ విషయాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ సభలో రహీమ్ యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ 'ఐసీయూలో ఉందని' వ్యాఖ్యానిస్తూ పాక్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.