Page Loader
Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య
సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక..

Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ చేసిన చర్యలను తప్పుబడుతూ,చౌదరి చేసిన వ్యాఖ్యల తీరులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంస్థాపకుడు హఫీజ్ సయీద్ గతంలో ఉపయోగించిన పదజాలం స్పష్టంగా కనిపించడం గమనార్హం. పాకిస్థాన్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చౌదరి మాట్లాడుతూ,"మీరు మా నీటిని అడ్డుకుంటే,మేము మీ ఊపిరిని అడ్డుకుంటాం"అని వ్యాఖ్యానించారు. గతంలో హఫీజ్ సయీద్ కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాలు 

 ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 23న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో,భారత్ సింధు నదీ ఒప్పందంలోని కొన్ని అంశాలను అమలు చేయడం నిలిపివేసింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా సింధు నదితో పాటు దాని ఉపనదుల నీటి పంపకాలు నిర్వచించబడ్డాయి. ఈ వ్యవహారంపై గురువారం భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. "ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటే,చర్చలకు స్థానం లేదు.పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించి ఉంచిన భారత భూభాగాల ఖాళీ చేయడంపై మాత్రమే భవిష్యత్తులో చర్చలు జరగగలవు" అని స్పష్టం చేశారు.

వివరాలు 

పాకిస్థాన్‌కు ఇది ఇప్పుడు అత్యంత ఖరీదైన వ్యవహారం

పాకిస్థాన్ తన దేశం నుంచి ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా, స్థిరంగా ఆపేంత వరకు సింధు ఒప్పందంపై తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా "నీరు, రక్తం కలిసి ప్రవహించవు" అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. అంతకుముందు,రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం కొనసాగిస్తే, వారు ప్రతి పైసా కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. "భారతీయుల రక్తంతో ఆటలాడే ప్రయత్నం చేసే పాకిస్థాన్‌కు ఇది ఇప్పుడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది" అని మోదీ ఘాటుగా హెచ్చరించారు.