Japan: జపాన్‌లో జనాభా సంక్షోభం.. జననాల రేటు 1899 తర్వాత అత్యల్పం!
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లో జనాభా సమస్య రోజురోజుకు ముదురుతోంది. 2024లో జననాల రేటు 5శాతం తగ్గి 7,20,988 గా నమోదైంది. 1899 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదవడం ఇదే తొలిసారి.
మరోవైపు వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో పని చేసే వయస్సులో ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతోంది.
దీని ప్రభావంగా పన్ను ఆదాయం తగ్గిపోతోంది. జననాల సంఖ్య తగ్గడం ఇది వరుసగా తొమ్మిదో ఏడాది కావడం ఆందోళన కలిగించే అంశం.
ఈ విషయాన్ని జపాన్ ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది.
వృద్ధుల పెరుగుదల
జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో మరణాల రేటు 1.8% పెరిగి 16 లక్షలకు చేరుకుంది.
ఈ పరిస్థితిని నియంత్రించేందుకు జపాన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.
Details
జనాభా పెంపుదల కోసం భారీ నిధులు
ప్రధాని ఇషిబా జనాభా పెంపునకు చిల్డ్రెన్ కేర్ పాలసీ కింద 3.6 ట్రిలియన్ యెన్ కేటాయించారు.
ఈ నిధులను పిల్లల్ని కనడానికి ఆసక్తిగా ఉన్న పెద్దలకు, చిల్డ్రన్ కేర్ వర్కర్స్ కోసం ఉపయోగిస్తున్నారు.
అయినా వివాహాలపై యువత ఆసక్తి లేకపోవడం, పెళ్లైనప్పటికీ పిల్లలను కనడంపై సుముఖంగా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
జనాభా తగ్గుదల వెనుక కారణాలు
నిరుద్యోగం, అధిక జీవన వ్యయం
మహిళలపై వివక్ష, పెరిగిన పని ఒత్తిడి
వివాహాలపై యువత ఆసక్తి లేకపోవడం ఈ పరిస్థితులు కొనసాగితే 2060 నాటికి జపాన్ జనాభా 8.67 కోట్లకు తగ్గిపోవచ్చని అంచనా.
Details
ఆర్థిక సంక్షోభానికి దారి
ప్రభుత్వం జననాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నా, ఆర్థికంగా అది సాధ్యం కాని పరిస్థితి.
అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం జపాన్ పబ్లిక్ రుణాలు జీడీపీ కంటే 232.7% అధికంగా ఉన్నాయి. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి భారీ ముప్పుగా మారింది.
కంపెనీల దివాలా
1995లో అత్యధికంగా పనిచేసే జనాభా ఉన్న జపాన్ ఇప్పుడు లేబర్ మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
నిరుద్యోగ రేటు 2.4% ఉండగా, ఇది 2040 నాటికి 3% వరకు పెరుగుతుందని అంచనా.
రిక్రూట్ వర్కర్స్ ఇన్‌స్టిట్యూట్ లెక్కల ప్రకారం, 1.1 కోట్ల ఉద్యోగుల కొరత ఏర్పడే అవకాశం ఉంది.
2024లో 342 కంపెనీలు దివాలా తీసాయి. కార్మికుల కొరతే ప్రధాన కారణమని టెయికోకు డేటా బ్యాంక్ వెల్లడించింది.
Details
సోషల్ సెక్యూరిటీ భారం పెరుగుతున్న పరిస్థితి
రిటైర్మెంట్ వయస్సు దాటిన జనాభా పెరుగుతుండటంతో సోషల్ సెక్యూరిటీ వ్యయం భారీగా పెరిగింది.
ప్రస్తుతం ప్రభుత్వం 253 బిలియన్ డాలర్లను కేటాయిస్తోంది. ఇది 10 ఏళ్ల క్రితం కంటే 20శాతం అధికం.
పెన్షన్ వ్యవస్థలో చెల్లించేవారి సంఖ్య 30 లక్షలు తగ్గింది, కానీ పెన్షన్ పొందే వారి సంఖ్య 40శాతం పెరిగింది.
Details
ప్రపంచ వ్యాప్తంగా జనాభా తగ్గుదల ట్రెండ్
జపాన్ లాగే, ఇతర దేశాలు కూడా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
దక్షిణ కొరియాలో 9 ఏళ్లుగా తగ్గిన జననాల రేటు ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది. కానీ 0.75% మాత్రమే అధికం.
ఫ్రాన్స్‌లో 2023 నుంచి జననాల రేటు గణనీయంగా పడిపోయింది. గత 50 ఏళ్లలో ఇది కనీవినీ ఎరుగని స్థాయిలో ఉంది.
చైనా మూడు సంవత్సరాలుగా జననాల రేటు తగ్గుదల నమోదు చేస్తోంది.
ఈ పరిణామాలు చూస్తుంటే, జనాభా తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.