
Pakistan: నీటి ద్వారా ప్రతీకారం.. బాగ్‌లిహార్ డ్యామ్ నుంచి నీరు నిలిపివేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారతదేశం ప్రతీకార చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.
తాజాగా మరో కీలక చర్యగా చినాబ్ నదిపై నిర్మించిన బాగ్‌లిహార్ డ్యామ్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్తున్న నీటి సరఫరాను నిలిపివేసింది.
ఇది దాయాది దేశాన్ని ఎండగట్టే రెండవ దాడిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో డ్యామ్ స్లూయిస్ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించడంతో పంజాబ్ ప్రావిన్స్‌కు నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది.
ఇది తాత్కాలిక చర్యేనని అక్కడి అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి వెల్లడించారు.
అయితే అవసరమైతే ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం భారత్‌కు ఉందని, ఈ చర్య ద్వారా పాకిస్థాన్‌కు స్పష్టంగా సంకేతమిచ్చినట్లు తెలుస్తోంది.
Details
2008లో చినాబ్ నదిపై బాగ్‌లిహార్ డ్యామ్ నిర్మాణం
ఈ 900 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బాగ్‌లిహార్ డ్యామ్ 2008లో చినాబ్ నదిపై నిర్మించారు. దీని పొడవు సుమారు 145 మీటర్లు.
సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్‌కు అధిక వాటా నీరు ఇచ్చే నదుల్లో చినాబ్ కూడా ఒకటి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్‌లోని పంట పొలాలు ఈ నదిపై ఆధారపడి ఉన్నాయి.
పహల్గాం ఘటన తరువాత 26న ఒప్పందం రద్దు చేసిన భారత్, ఏప్రిల్ 29 నాటికి డ్యామ్ ద్వారా నీటి ప్రవాహాన్ని నిలిపేసినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేశాయి.
దీంతో పాక్‌లోని సియాల్‌కోట్ వద్దకు వచ్చేసరికి చినాబ్ నది పూర్తిగా ఎండిపోయిన దృశ్యాలు బయటపడ్డాయి.
Details
వ్యవసాయం రంగంపై ప్రభావం
పత్తి, వరి వంటి పంటల సాగు కోసం ఈ నీరు చాలా కీలకం కావడంతో పాక్ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇక ఇదే సమయంలో జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
గత వారం ముజఫరాబాద్ సమీపంలోని హట్టియాన్ బాలా ప్రాంతంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది.
ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని మసీదుల ద్వారా హెచ్చరించారు.
జీలం నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి, చకోథి వద్ద పీవోకేలోకి చేరుతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తే, ఉగ్రదాడికి కౌంటర్‌గా నీటి ఆయుధాన్ని భారత్ సమర్థవంతంగా వినియోగిస్తోందని చెప్పొచ్చు.