Sam Altman:"మస్క్‌జీవితమంతా అభద్రతా భావమే": ఓపెన్‌ఏఐ-ఎలాన్ మస్క్ మధ్య పెరిగిన విభేదాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మధ్య గడిచిన కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి.
తాజాగా, ఓపెన్‌ఏఐను కొనుగోలు చేయడానికి మస్క్ చేసిన ప్రతిపాదనతో ఈ వివాదం మరింత తీవ్రతరమైంది.
దీనిపై స్పందించిన ఆల్ట్‌మన్, మస్క్ గురించి మాట్లాడుతూ, "ఆయనను చూస్తే జాలి కలుగుతోంది" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బ్లూమ్‌బర్గ్ ఇంటర్వ్యూలో భాగంగా వెలువడ్డాయి.
సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ, "బహుశా మస్క్ జీవితమంతా అభద్రతా భావంలోనే గడిచిందేమో. ఆయన సంతోషంగా ఉండే వ్యక్తి అని అనిపించదు. మా అభివృద్ధి వేగాన్ని తగ్గించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
మస్క్ భారీ ఆఫర్‌ను తిరస్కరించిన సామ్ ఆల్ట్‌మాన్
ఇటీవల మస్క్ ఓపెన్‌ఏఐను సొంతం చేసుకోవాలని పెద్ద మొత్తంలో ఆఫర్ ఇచ్చారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, 97.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.5 లక్షల కోట్ల)కు ఓపెన్‌ఏఐని కొనుగోలు చేసేందుకు మస్క్ తన ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్‌తో కలిసి అధికారిక ప్రతిపాదనను సమర్పించారు.
మస్క్ న్యాయవాది ప్రకారం, "ఓపెన్‌ఏఐని పూర్తిగా లాభాపేక్ష గల సంస్థగా మార్చాలని ఆల్ట్‌మన్, బోర్డు కోరుకుంటే, మేము సిద్ధంగా ఉన్నాం. వారు నియంత్రణ వదులుకోవాలనుకుంటే, తగిన పరిహారం చెల్లించడానికి మా ఛారిటీ సిద్దంగా ఉంటుంది" అని తెలిపారు.
కానీ, మస్క్ చేసిన ఈ భారీ ఆఫర్‌ను సామ్ ఆల్ట్‌మాన్ తిరస్కరించారు.అంతేకాకుండా,ఆయన దీని ప్రతిస్పందనగా "అవసరమైతే మేము ఎక్స్ (మునుపటి ట్విటర్)ను కొనుగోలు చేస్తాం"అంటూ వివరణ ఇచ్చారు.
వివరాలు
ఓపెన్‌ఏఐ & మస్క్ వివాదం - నేపథ్యం
"మీ ఆఫర్‌కు నా సమాధానం - 'నో'. మీరు కోరుకుంటే, మేము ఎక్స్‌ను 9.47 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 85 వేల కోట్లు)కు కొనుగోలు చేస్తాం" అని ఆల్ట్‌మన్ ఎక్స్ (Twitter)లో పోస్ట్ చేశారు.
దీనికి కౌంటర్‌గా, ఎలాన్ మస్క్ "మోసగాడు" అంటూ ఆల్ట్‌మన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ 2022 నవంబరులో విడుదలై, కేవలం ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది.
కానీ, ఓపెన్‌ఏఐను 2015లో స్థాపించినప్పుడు,మస్క్ కూడా ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారు.
వివరాలు
44 బిలియన్ డాలర్లకు ట్విటర్
అయితే, 2018లో మస్క్ కంపెనీ నుంచి వైదొలిగారు. 2019లో మైక్రోసాఫ్ట్ ఓపెన్‌ఏఐలో 14 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.
అయితే, సంస్థ స్థాపన సమయంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, 2023లో మస్క్ ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై దావా వేశారు.
మరోవైపు, 2022 అక్టోబరులో 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్విటర్‌ను 'ఎక్స్'గా రీబ్రాండ్ చేశారు.