South Korea: 1,500 మంది సైనికులను రష్యాకు పంపిన ఉత్తర కొరియా
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా 1,500 మంది సైనికులను రష్యాకు పంపినట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ చీఫ్ చావోతాయ్ యంగ్ తెలిపారు. ఈ విషయాన్ని తమ దేశ చట్టసభ సభ్యులకు వివరించారు. డిసెంబర్ నాటికి 10,000 మంది సైనికులను పంపించాలని ప్యాంగ్‌యాంగ్ ప్లాన్ లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ నెలలో ఉక్రెయిన్ యుద్ధానికి ఉత్తర కొరియా ప్రత్యేక దళంగా 1,500 మందిని రష్యాకు పంపించినట్లు దక్షిణ కొరియా గూఢచార సంస్థ ధ్రువీకరించింది. 2023 ఆగస్టు నుండి రష్యాకు 13,000 ఆయుధాలను పంపినట్లు కూడా వెల్లడించారు.
ఉత్తర కొరియా నుండి రష్యాకు ప్రత్యేక బలగాలు
రష్యా యుద్ధ నౌకల ద్వారా 1,500 మంది ఉత్తర కొరియా నుండి వచ్చిన ప్రత్యేక బలగాలు రష్యాలోని వ్లాదివోస్టోక్ రేవు నగరాన్ని చేరుకున్నట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్‌ఐఎస్) తెలిపింది. త్వరలో మరిన్ని బలగాలు అక్కడికి చేరుతాయని పేర్కొంది. రష్యాలో మోహరించిన ఉత్తర కొరియా సైనికులకు రష్యా సైనిక యూనిఫామ్‌లు, ఆయుధాలు, నకిలీ గుర్తింపు పత్రాలు అందించినట్లు సమాచారం వచ్చింది. ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి వారిని పోరులోకి దించే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఉత్తర కొరియా బలగాలను తమ దేశం వినియోగిస్తున్నట్లు వచ్చిన వార్తలను రష్యా అధ్యక్ష భవన అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఖండించారు.
యుద్ధంలో మూడో దేశం ప్రవేశిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు: జెలెన్‌స్కీ
దక్షిణ కొరియా విదేశాంగ ఉపమంత్రి కిమ్ హాంగ్ క్యూన్ రష్యా రాయబారి జార్జి జినోవిచ్‌తో సమావేశమై ఉత్తర కొరియా చర్యలను తీవ్రంగా ఖండించారు. ఉత్తర కొరియాతో తమ సహకారం దక్షిణ కొరియా భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని జినోవిచ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ, యుద్ధంలో మూడో దేశం ప్రవేశిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు అని హెచ్చరించారు.