
UK Warns: గాజాలో కాల్పుల విరమణ విఫలమైతే.. పాలస్తీనాకే మద్దతిస్తాం.. బ్రిటన్‌పై మండిపడ్డ నెతన్యాహు
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా, ఈ జాబితాలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా చేరారు. గాజాలో యుద్ధ విరమణ జరగకపోతే, బ్రిటన్ ప్రభుత్వం పాలస్తీనా దేశాన్ని గుర్తించడాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని స్టార్మర్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పులను నిలిపేయాలని డిమాండ్ చేసిన స్టార్మర్, గాజాలో మానవతా సంక్షోభం తీవ్రంగా పెరుగుతోందని తెలిపారు. యూఎన్ తరఫున సహాయ కార్యక్రమాలకు అనుమతించాల్సిన అవసరం ఉందని, అక్కడి పరిస్థితుల్ని మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిలో విఫలమైతే వచ్చే సెప్టెంబరులో బ్రిటన్ పాలస్తీనా దేశానికి అధికారిక గుర్తింపు ఇస్తుందని గట్టి హెచ్చరిక జారీ చేశారు.
వివరాలు
మద్దతిచ్చే ప్రయత్నాలు ఎప్పటికైనా విఫలమవుతాయి
ఇజ్రాయెల్, గాజాలో దీర్ఘకాలిక కాల్పుల విరమణకు అంగీకరించాలని స్టార్మర్ స్పష్టం చేశారు. శాంతి పునరుద్ధరణకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాలని కోరారు. యూఎన్ పంపిణీ చేసే సహాయసరఫరాలపై అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆకలితో బాధపడుతున్న శిశువుల స్థితిని ఉద్దేశించి,ఈ సంక్షోభానికి త్వరగా ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా,బ్రిటన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇటువంటి చర్యలు తీసుకుంటే దానికి తగిన ప్రతిఫలం ఎదురవుతుందంటూ హెచ్చరించారు. జిహాదీ ఉగ్రవాదానికి పరోక్షంగా మద్దతిచ్చే ప్రయత్నాలు ఎప్పటికైనా విఫలమవుతాయని స్పష్టం చేశారు. స్టార్మర్ తీవ్రంగా విమర్శిస్తూ,ఆయన ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్నారని,మృతులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్మర్ ప్రయత్నాలు విఫలం అవుతాయని నెతన్యాహు చెప్పారు.