Sunita Williams: క్రూ డ్రాగన్ ల్యాండింగ్ రహస్యాలు.. నేలపై కాకుండా సముద్రంలోనే ఎందుకు?
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
అయితే భూమికి తిరిగి వచ్చిన వ్యోమనౌక ల్యాండింగ్ కోసం నేలపై కాకుండా సముద్రాన్ని నాసా ఎందుకు ఎంచుకుంది? ఈ ప్రశ్నకు అనేక కారణాలున్నాయి.
ప్రపంచంలోని వివిధ దేశాలు అంతరిక్ష యాత్రలు ముగిసిన తర్వాత వ్యోమనౌకలను భూమిపై దించేందుకు భిన్నమైన విధానాలను అనుసరిస్తున్నాయి.
రష్యా తన స్పేస్ క్యాప్సూల్స్‌ను నేలపై దించుతుండగా, అమెరికా మాత్రం సముద్రానికి ప్రాధాన్యత ఇస్తోంది.
Details
రష్యా.. నేలపైనే ల్యాండింగ్ ఎందుకు?
రష్యాలో వ్యోమనౌకలను భూమిపై దించేందుకు అనువైన సముద్ర ప్రాంతాలు లేవు.
ల్యాండింగ్‌కి వీలైన బేరెంట్స్ సీ, లాప్టెవ్ సముద్రం, తూర్పు సైబీరియా సముద్రం ఉన్నా అక్కడి తీవ్ర శీతల వాతావరణం ప్రధాన అవరోధంగా మారుతోంది.
ఆ జలాలు హిమప్రదేశాలకు సమానంగా ఉండటంతో వ్యోమనౌకలోకి నీరు లీకైతే, వ్యోమగాములు గడ్డకట్టిపోవచ్చు. అలాగే సహాయ బృందాలకు వ్యోమనౌకను వెలికితీయడం చాలా కష్టసాధ్యమవుతుంది.
ఈ సముద్ర ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో రష్యా ఆ ప్రదేశాల్లో ల్యాండింగ్‌కి ఆసక్తి చూపడం లేదు.
దీనివల్ల, రష్యా భూమిపై ల్యాండింగ్ కోసం జనావాసాలు లేని విస్తృత భూభాగాలను ఉపయోగిస్తోంది. రెట్రో రాకెట్లు, పారాచూట్ల సహాయంతో వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తూ భద్రంగా నేలపై దించుతోంది.
Details
సముద్ర ల్యాండింగ్‌కు అమెరికా ఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది
అమెరికా భౌగోళికంగా సముద్ర ల్యాండింగ్‌కి అనువైనదిగా ఉండటంతో, భూమిపై దించాల్సిన అవసరం లేకుండా సాగరాలను ఎంచుకుంది.
వ్యోమనౌక భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత పారాచూట్ల సహాయంతో వేగాన్ని తగ్గించి, సముద్రంలో సాఫీగా ల్యాండ్ అయ్యేలా చేస్తుంది.
ఇలా చివరి దశలో ప్రత్యేక ఇంజిన్లు వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.
అమెరికాకు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు అందుబాటులో ఉండటంతో పాటు, అక్కడ భారీగా నౌకాదళం మోహరించి ఉండడం కూడా సముద్ర ల్యాండింగ్‌కి మరో ప్రధాన కారణం.
అయితే గతంలో జెమినీ, అపోలో, మెర్క్యూరీ స్పేస్ క్యాప్సూల్స్‌తో పాటు, ప్రస్తుతం క్రూ డ్రాగన్ వంటి వ్యోమనౌకలు కూడా సముద్రంలోనే ల్యాండ్ అవుతున్నాయి.
భారతదేశం కూడా తన గగన్‌యాన్ మానవసహిత అంతరిక్ష యాత్రలో ఇదే విధానాన్ని అనుసరించనుంది.
Details
సముద్ర ల్యాండింగ్ ప్రయోజనాలు
1. కూషన్ ఎఫెక్ట్
నీటి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల, వ్యోమనౌకను మృదువుగా స్వీకరించేలా సముద్రం కూషన్‌లా పనిచేస్తుంది. ఫలితంగా వ్యోమనౌక దెబ్బతినే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
2. నిర్దిష్ట ప్రదేశం అవసరం లేకపోవడం
భూమిపై ల్యాండింగ్ కోసం ఖచ్చితమైన ప్రదేశం కావాలి. కానీ సముద్రం విస్తృతంగా ఉండటంతో, వ్యోమనౌక నిర్దేశిత ప్రదేశానికి కొద్దిగా దూరంలో ల్యాండ్ అయినా ఇబ్బంది ఉండదు.
3. సహాయ బృందాలకు సులభతరం
వ్యోమనౌక ల్యాండ్ అయిన వెంటనే సహాయ బృందాలు సులభంగా అక్కడికి చేరుకొని, వ్యోమగాములను క్షేమంగా వెలికితీయగలవు.
ఈ కారణాల వల్ల భూమికి తిరిగి వచ్చే వ్యోమనౌకలకు సముద్ర ల్యాండింగ్ అత్యంత సురక్షితమైన, సమర్థవంతమైన మార్గంగా నిలుస్తోంది.