Page Loader
Mumbai Attacks: తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగింతకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం
తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగింతకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం

Mumbai Attacks: తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగింతకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన భీకర ఉగ్రదాడి ఇప్పటికీ దేశ ప్రజలను కలవరపెడుతుంది. 26/11 ఉగ్రదాడుల్లో కీలక నిందితుడిగా తేలిన తహవూర్‌ రాణాను అమెరికా నుంచి భారత్‌కు అప్పగించేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ కేసులో తహవూర్‌ రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తహవూర్‌ రాణా పాకిస్థాన్‌ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా అతడిని గుర్తించారు. ప్రస్తుతం రాణా లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించాలని భారత్‌ బలమైన వాదనతో పలు కోర్టులను ఆశ్రయించింది. అయితే తనను భారత్‌కు అప్పగించవద్దని రాణా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్‌ కోర్టులు తిరస్కరించాయి.

Details

త్వరలోనే భారత్ కు రాణా

చివరకు శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ చుక్కెదురైన రాణా, 2022 నవంబర్‌లో అమెరికా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అమెరికా ప్రభుత్వం కూడా రాణా పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, అతడిని భారత్‌కు అప్పగించాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. 20 పేజీల అఫిడవిట్‌ దాఖలు చేసి, రాణా అభ్యర్థనను తిరస్కరించమని కోరింది. దీంతో అమెరికా సుప్రీంకోర్టు తహవూర్‌ రాణా రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. న్యాయపరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక అతడిని కొద్ది నెలల్లో భారత్‌కు తీసుకొచ్చే అవకాశముంది. ముంబై దాడులకు ముందు, డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. హెడ్లీకి రాణా లాజిస్టికల్‌ సహకారం అందించాడని తెలుస్తోంది.

Details

2009లో రాణాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

2008లో ఈ దాడులకు అవసరమైన ప్రణాళికల్లో రాణా కీలక పాత్ర పోషించాడు. 2009లో షికాగోలో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. 2008 నవంబర్‌ 26న పాకిస్థాన్‌ ఉగ్రవాదులు కొలాబా సముద్రతీరంలో దిగి, ముంబయిలోకి ప్రవేశించారు. ఏకే-47 తుపాకులతో వీరంతా బృందాలుగా విడిపోయి, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌, హోటల్‌ తాజ్‌, నరిమాన్‌ హౌస్‌ వంటి కీలక ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఈ ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. తహవూర్‌ రాణాను భారత్‌కు తీసుకురావడం ద్వారా న్యాయం మరింత సక్రమంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.