
Trump Tariffs: : భారత్ రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తే.. రేపటినుంచే 25 శాతం సుంకాలు: పీటర్ నవారో
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారతదేశంపై అమెరికా మరోసారి అసహనం వ్యక్తం చేసింది. భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు వాణిజ్య సుంకాల రూపంలో చర్యలు తీసుకుంటున్న అమెరికా, ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగడానికి ఇండియానే కారణమని శ్వేతసౌధం సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. ఈ యుద్ధాన్ని ఆయన 'మోదీ యుద్ధం'గా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. రాయితీలతో భారత్ ముడి చమురు కొనుగోలు చేయడం మాస్కో దూకుడుకు ప్రోత్సాహకరంగా మారిందని ఆయన ఆరోపించారు. భారత చర్యల ఫలితంగా అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు.
వివరాలు
భారత ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యకరం: పీటర్ నవారో
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే అమెరికా విధిస్తున్న సుంకాలను 25శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా భారత్‌పై విధించిన 50శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పీటర్ నవారో బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్నిప్రస్తావిస్తూ,ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలంటే భారత్ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఒకవేళ భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేస్తే,మరుసటి రోజే అమెరికా 25శాతం సుంకాలను పునరుద్ధరిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో భారత ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యకరమని,ఆయనలాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు.
వివరాలు
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని న్యూఢిల్లీ రిఫైనరీలు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాయి: పీటర్
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారత్ పరోక్ష మద్దతు అందిస్తోందని పీటర్ నవారో ఆరోపించారు. రాయితీలతో భారత్ భారీ మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తోందని,ఆ డబ్బును మాస్కో ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగించడానికి వినియోగిస్తోందని ఆయన విమర్శించారు. పీటర్ భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గత వారం కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని న్యూఢిల్లీ రిఫైనరీలు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాయని ఆయన ఆరోపించారు. అలాగే,భారత్ అమెరికాకు విక్రయిస్తున్నవస్తువుల ద్వారా సంపాదించిన నిధులను రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు ఉపయోగిస్తున్నదని,దీంతో భారీ లాభాలు సాధిస్తోందని అన్నారు. రష్యా ఆ నిధులను ఉక్రెయిన్‌ను నాశనం చేయడానికి వినియోగిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.