Trump: ఆ దేశానికి నిధులు ఇవ్వాల్సిన పనిలేదు.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వ్యయాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
భారత్‌లో (India) జరిగే ఎన్నికల్లో ఓటర్ల టర్నౌట్‌ను పెంచే లక్ష్యంతో కేటాయించిన 21 మిలియన్ డాలర్ల నిధి (Fund to boost Voter Turnout)ను ఈ విభాగం ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది.
అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఈ నిధుల కోసం ఎందుకు ఉపయోగించాలనే ప్రశ్నను ట్రంప్ లేవనెత్తారు.
వివరాలు
భారత్ దగ్గర చాలా డబ్బు ఉంది
ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నిధుల రద్దు గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ— "భారత్‌కు మేమెందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలి? వాళ్ల వద్ద ఇప్పటికే చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. వారు విధించే సుంకాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ విషయంలో అమెరికా, భారత్‌ను చేరుకోవడం అసాధ్యం. నాకు భారత ప్రజలు, అక్కడి ప్రధాని పట్ల ఎంతో గౌరవం ఉంది. కానీ, ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మా దేశ డబ్బును ఎందుకు ఖర్చు చేయాలి? అమెరికాలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది?" అని ట్రంప్ ప్రశ్నించారు.
వివరాలు
భారత ఎన్నికల నిధులు రద్దు
డోజ్ విభాగం, ప్రపంచంలోని వివిధ దేశాలకు ఇచ్చే నిధులను తగ్గించేందుకు ఫిబ్రవరి 16న ఒక జాబితా విడుదల చేసింది.
ఈ జాబితాలో భాగంగా భారత ఎన్నికల నిధులను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.
అలాగే, బంగ్లాదేశ్, నేపాల్ వంటి ఇతర దేశాలకు కేటాయించిన నిధులను కూడా ఉపసంహరించుకుంది. అయితే, ఈ నిర్ణయం భారతదేశంలో రాజకీయ వాదనలకు దారితీసింది.
వివరాలు
భారత ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోవడమే..
"ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లా? ఇది భారత ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఈ నిధులతో అసలు ఎవరు లాభపడుతున్నారు? అధికార పార్టీ మాత్రం కాదు," అని బీజేపీ (BJP) జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ తన సోషల్ మీడియా ఖాతాలో వ్యాఖ్యానించారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో విదేశీ సంస్థలు వ్యాపించడానికి ప్రయత్నిస్తున్నాయి అంటూ ఆయన మండిపడ్డారు.
అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయని ఆరోపించారు. అయితే, ఈ విమర్శలను కాంగ్రెస్ నేతలు ఖండించారు.