
Donald Trump: డ్రాగన్‌పై సుంకాల మోతకు 90 రోజుల విరామిచ్చిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తూ విమర్శలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. తొలుత చైనాపై సుంకాల మోత మోగించిన ఆయన, ఆ తర్వాత ఆ దేశంతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. చైనా కూడా తన అధికారిక మీడియాలో, వాణిజ్య ఒప్పంద చర్చల గడువును పొడిగించినట్లు ప్రకటించింది. మంగళవారం అర్ధరాత్రి చైనాతో వాణిజ్య ఒప్పందానికి తొలుత నిర్ణయించిన 90 రోజుల గడువు ముగియనుండగా, ట్రంప్ ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
Details
ప్రస్తుతం 30శాతం మాత్రమే సుంకాలు విధింపు
అంతకుముందు అమెరికా, చైనాలు పరస్పరం 100 శాతం కంటే ఎక్కువ సుంకాలు విధించుకున్నప్పటికీ, ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతులపై అమెరికా 30 శాతం సుంకాలను మాత్రమే అమలు చేస్తోంది. భారత్ నుంచి దిగుమతులపై 25 శాతం సుంకాలు అమల్లో ఉండగా, ఈ నెల 27 నుంచి మరిన్ని 25 శాతం సుంకాలను వసూలు చేయడానికి సిద్ధమైంది. ప్రపంచంలోని అనేక దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్, ఆ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నప్పటికీ, చైనాతో మాత్రం డీల్ ఇంకా పూర్తి కాలేదు. ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నా, కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి.
Details
చైనాతో సుంకాల సమస్య మరింత సంక్లిష్టం
ఈ ఏడాది చివర్లో అమెరికా, చైనా అధ్యక్షులు భేటీ కానున్న నేపథ్యంలో, తాజా విరామం వాణిజ్య ఒప్పంద చర్చలకు మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, చైనాతో సుంకాల సమస్య మరింత సంక్లిష్టమని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయాన్ని మించి, అనేక ఇతర అంశాలు అమెరికా-చైనా సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఇదే సమయంలో, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందన్న కారణంతో భారత్‌పై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తున్నారని గుర్తుచేశారు. చైనా కూడా రష్యా నుంచి విస్తారంగా చమురు దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.