LOADING...
Trump: భారత్‌‌కు ట్రంప్ తాజా హెచ్చరిక.. 20-25 శాతం సుంకాలుంటాయని వార్నింగ్
భారత్‌‌కు ట్రంప్ తాజా హెచ్చరిక.. 20-25 శాతం సుంకాలుంటాయని వార్నింగ్

Trump: భారత్‌‌కు ట్రంప్ తాజా హెచ్చరిక.. 20-25 శాతం సుంకాలుంటాయని వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగిసేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఆగస్టు 1తో ఈ గడువు పూర్తవుతుంది. అయితే ఇప్పటికీ భారత్‌-అమెరికా మధ్య స్పష్టమైన ఒప్పందం తుదిరూపం దాల్చలేదు. ఇప్పటివరకు మొత్తం ఐదు విడతల చర్చలు జరిపినప్పటికీ,వాటి నుంచి ఎలాంటి ప్రత్యక్ష ఫలితం లభించలేదు. అమెరికా పాలకులు పాడి ఉత్పత్తులు,వ్యవసాయ ఉత్పత్తులపై రాయితీలు కోరుతున్నారు. భారతీయులకి పాడి,వ్యవసాయ రంగాలు కేవలం ఆర్థిక దృష్టికోణంలో కాకుండా, భావోద్వేగాలతో కూడిన అంశాలుగా ఉన్నాయి. ఈ రంగాల్లో అమెరికా కోరికలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందువల్లనే ఈ చర్చలు ముందుకు సాగటం లేదు.

వివరాలు 

భారత్‌పై 20 నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాలు అమలు 

ఇదిలా ఉంటే, స్కాట్లాండ్ పర్యటనను పూర్తి చేసుకుని వాషింగ్టన్‌కి వెళ్తున్న సమయంలో, విమానంలో (ఎయిర్ ఫోర్స్ వన్) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై 20 నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాలు అమలవుతాయని ఆయన హెచ్చరించారు. భారత్ తమకు మంచి మిత్రదేశమని ఆయన పేర్కొన్నప్పటికీ, భారత్ అమలు చేస్తున్న సుంకాల రేట్లు అధికంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, అవి విజయవంతం కాకపోతే 20-25 శాతం దిగుమతి సుంకాలు అమలవుతాయని ట్రంప్ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. అంతేకాదు, తన అభ్యర్థన కారణంగానే భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తగ్గాయని, కాబట్టి భారత్ తన మాట వినడం మంచిదని ఆయన మరోసారి గుర్తుచేశారు.

వివరాలు 

 తన అభ్యర్థన మేరకే భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసింది 

ఈ వివాదానికి పునాది ఏప్రిల్ 2న పడింది.అదే రోజున ట్రంప్ ఆయా దేశాలపై సుంకాలు విధించారు. అయితే వివిధ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 90రోజుల వరకు గడువు ఇచ్చారు. ఆ గడువు ముగిసిన తరువాత,మరోసారి ఆగస్టు 1 వరకు గడువు పొడిగించారు. ఇప్పుడు ఆ గడువు కూడా పూర్తయ్యేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో, అమెరికా ఇప్పటికే కొన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే భారత్ మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉంది.చర్చలు కొనసాగుతున్నప్పటికీ,ఎలాంటి ముగింపు లేదనే వాస్తవం ముందుంది. తాజా సమాచారం ప్రకారం,ఆగస్టు నెల మధ్యలో అమెరికా అధికారుల బృందం భారత్‌కి రానుంది.ఆ సందర్శన సమయంలో ఒక స్పష్టత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వివరాలు 

అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు 

ఇక పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందం కోసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి మొదటి దశను ఖరారు చేయాలని ఇరు దేశాలూ యత్నిస్తున్నాయి. జూలై 26న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇక యూరోపియన్ యూనియన్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల్ని ఖరారు చేసుకున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.