
Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఖరారు .. ఎప్పుడంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 15న అలాస్కాలో పుతిన్‌ను కలవనున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఇప్పటివరకు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేశారు. సౌదీ అరేబియాలో రెండు దేశాల ప్రతినిధులతో చర్చలు కూడా జరిపించారు. అయితే ఆ చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఈసారి స్వయంగా రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్‌తో భేటీకి ముందు పుతిన్ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో కూడా ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారు.
వివరాలు
ఆగస్టు 15న జరిగే ఈ సమావేశం వారిద్దరి మధ్య జరిగే మొదటి ప్రత్యక్ష భేటీ
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ట్రంప్-పుతిన్ భేటీ జరగలేదు. ఈ కారణంగా, ఆగస్టు 15న జరిగే ఈ సమావేశం వారిద్దరి మధ్య జరిగే మొదటి ప్రత్యక్ష భేటీ కానుంది. అయితే ఈ చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలకడానికి ట్రంప్ పలు ప్రయత్నాలు చేసినా, ఇప్పటివరకు అవి విజయవంతం కాలేదు. కాబట్టి, ఈసారి జరిగే చర్చల అనంతరం అయినా కాల్పుల విరమణ సాధ్యమవుతుందేమో అన్నదే అందరి దృష్టి.
వివరాలు
2022లో ప్రారంభమైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం
2022లో ప్రారంభమైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ ఘర్షణలో ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భారీ భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరు దేశాలు ఆర్థికపరంగా, మౌలిక సదుపాయాల పరంగా విపరీతమైన నష్టాన్ని చవిచూశాయి. గతంలో జరిగిన అనేక యుద్ధాలు చివరికి ఆగిపోయినా, ఈ యుద్ధం మాత్రం చల్లారకుండా మరింత ఉధృతంగా కొనసాగుతోంది. ఇరు పక్షాలు కాల్పుల విరమణ కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలితాన్ని ఇవ్వలేదు.