
Donald Trump: 'అణు యుద్ధాన్ని ఆపాను': భారతదేశం,పాకిస్తాన్ పై ట్రంప్ అదే మధ్యవర్తిత్వ వాదన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్‌ల మధ్య తాను మధ్యవర్తిత్వం నిర్వహించానని పేర్కొన్నారు. తన చొరవతోనే ఈ రెండు దేశాల మధ్య నాలుగు రోజులపాటు కొనసాగిన ఘర్షణను ఆపగలిగానని తెలిపారు. "యుద్ధాలను ఆపడంలో మేము విజయవంతమయ్యాము. ఆ జాబితాలో భారత్-పాకిస్తాన్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఈ దేశాలు మరికొద్ది రోజుల్లోనే అణు యుద్ధానికి దిగిపోయేవి. అది చాలా భయంకరమైనదిగా మారేది. అయితే మేము ఆ యుద్ధాన్ని ఆపగలిగాము" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివరాలు
ఇరుదేశాల నేతలు అణ్వాయుధాలతో దాడి చేసే సత్తా కలిగినవారే: ట్రంప్
తన వ్యూహంలో భాగంగా వాణిజ్యాన్ని ఒత్తిడిగా మార్చుకుని వ్యవహరించానని, ఘర్షణ ముగిసే వరకు వాణిజ్య చర్చల గురించి మాట్లాడబోమని చెప్పడంతో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగానని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గత జూన్‌లో కూడా విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తబోయే అణు యుద్ధాన్ని తానే నివారించానని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, తాను భారత్, పాకిస్తాన్ నేతలతో మాట్లాడిన విషయాన్ని చెప్పారు. ఇరుదేశాల నేతలు అణ్వాయుధాలతో దాడి చేసే సత్తా కలిగినవారేనని ట్రంప్ తెలిపారు.
వివరాలు
అమెరికా మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేదు: భారత్
అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ ఇప్పటికే తిరస్కరించింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి కాల్పుల విరమణ, సైనిక చర్యలపై అవగాహన కుదిరే వరకు మాత్రమే భారత్, అమెరికా నేతల మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొంది. ఇందులో ఎక్కడా అమెరికా మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేదని స్పష్టంచేసింది. మే 7న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.