
USA: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. మిడిల్ ఈస్ట్ లో ఉన్న సిబ్బంది వెనక్కు రప్పిస్తున్న అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులు, సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో అణు ఒప్పందం జరిగే అవకాశం లేకపోతే, ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఖచ్చితమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని పాక్షికంగా ఖాళీ చేయడానికి చర్యలు చేపట్టినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల చమురు ధరలు ఒక్కసారిగా 4 శాతం కంటే ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లో ఉన్న అమెరికన్లు స్వచ్ఛందంగా తమ దేశానికి తిరిగి రావడానికి విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చినట్టు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో అమెరికా తన సైనిక స్థావరాలు కలిగి ఉందని వారు వివరించారు. ఈ ప్రాంతాలు ప్రపంచంలో ప్రధాన చమురు ఉత్పత్తి కేంద్రాలు కావడంతో పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అణు ఒప్పంద చర్చలు మరో మారు మొదలుకానున్న సమయంలో, సంచలనమైన విషయాలు వెలుగుచూశాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ ఇప్పటికి ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని ప్రధాన స్థావరాలకు ఆయుధాల తరలింపు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి
గత ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు విదేశాంగ శాఖ నిపుణులు మెరిల్యాండ్‌లోని క్యాంప్ డేవిడ్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం నేపథ్యంలో ఇజ్రాయెల్ చర్యలు వేగవంతమవుతున్నట్లు భావిస్తున్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అయితే ఆ దాడుల తీవ్రత ఎంత వరకు ఉంటుందో, ఎప్పుడు జరుగుతాయన్న విషయంలో స్పష్టత లేదు. ఇక ఇజ్రాయెల్ దాడికి దిగితే, తాము కూడా ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సంకేతాలిస్తోంది. అంతేగాక, అవసరమైతే న్యూక్లియర్ ఆయుధాలను కూడా ఉపయోగించేందుకు వెనుకాడబోమని సంకేతాలిస్తున్నట్లు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ తెలిపారు.