Page Loader
Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. జీ7 ట్రిప్‌ నుంచి అమెరికాకు ట్రంప్‌
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. జీ7 ట్రిప్‌ నుంచి అమెరికాకు ట్రంప్‌

Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. జీ7 ట్రిప్‌ నుంచి అమెరికాకు ట్రంప్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు. జీ7 సదస్సు కోసం ఆయన కెనడాలో ఉన్నప్పటికీ, పరిస్థితి అత్యవసరంగా మారడంతో ట్రంప్‌ త్వరగా అమెరికాకు తిరిగివస్తున్నారు. ఆయన అమెరికా చేరిన వెంటనే భద్రతా సలహాదారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ అంశాన్ని వైట్‌హౌస్‌ మీడియా ప్రతినిధి కరోలిన్‌ లీవిట్‌ అధికారికంగా వెల్లడించారు.

వివరాలు 

 ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

''జీ7 సదస్సులో ట్రంప్‌ పాల్గొన్నారు. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో కీలక ఒప్పందంపై చర్చించి, దానిని పూర్తి చేశారు. కానీ, పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఆయన పర్యటనను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది,'' అని లీవిట్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం (కెనడా సమయాన్ని అనుసరించి) జీ7 దేశాల నేతలతో గ్రూప్‌ ఫొటో దిగిన అనంతరం, ''నేను అత్యవసరంగా తిరిగి వెళ్లాలి. ఇది అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయం,'' అంటూ ట్రంప్‌ ప్రకటించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం సరైందని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధాన్ని ఆపాలని జీ7 దేశాల నేతలు పిలుపునిచ్చారు.

వివరాలు 

సిద్ధంగా ఉండండి..: ట్రంప్‌ 

ట్రంప్‌ అమెరికా చేరిన వెంటనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారులతో భద్రతా సమీక్షా సమావేశం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో, వైట్‌హౌస్‌లోని సిట్యుయేషన్‌ రూమ్‌ ను సిద్ధంగా ఉంచాలని జాతీయ భద్రతా మండలిని ఆయన ఇప్పటికే ఆదేశించారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలపై కీలక ప్రకటనలు ట్రంప్‌ చేయనున్నట్టు సమాచారం.

వివరాలు 

టెహ్రాన్‌లోని అమెరికా పౌరులకు ట్రంప్ హెచ్చరిక 

యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో నివసిస్తున్న అమెరికా పౌరులు ఆ ప్రాంతాన్ని వెంటనే విడిచిపెట్టాలని ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో పాటు, అమెరికా వైమానిక దళాలు దాడులకు సన్నద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది. అవసరమైతే అమెరికా కూడా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉందని తాజా సంకేతాలు తెలియజేస్తున్నాయి.