
USA: అత్యంత కఠినమైన అల్కాట్రాజ్ జైలును మళ్లీ తెరవనున్న ట్రంప్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అత్యంత భయంకరమైన,కఠినమైన జైళ్లలో ఒకటైన అల్కాట్రాజ్‌ను మళ్లీ ప్రారంభించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రారంభించారు.
సుమారు 60 సంవత్సరాల క్రితం మూతపడ్డ ఈ జైలు గురించి తాజాగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాలిఫోర్నియాలోని ఓ ద్వీపంపై ఉన్న ఈ జైలును తిరిగి ప్రారంభించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
వివరాలు
అల్కాట్రాజ్ జైలును పునర్నిర్మించి తిరిగి ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు
ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక అయిన 'ట్రూత్'లో ఆదివారం సాయంత్రం ఇచ్చిన ప్రకటనలో మాట్లాడుతూ,''ఇప్పటికే అమెరికా వివిధ రకాల నేరాలు చేసే, హింసాత్మక ప్రవర్తన కలిగిన వ్యక్తుల వల్ల బాధపడుతోంది. వారు దేశానికి ఏ ప్రయోజనం కలిగించకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారు. గతంలో అలాంటి అత్యంత ప్రమాదకర నేరగాళ్లను ప్రజల నుండి ఎంతో దూరంగా ఉన్న కఠినమైన జైళ్లలో ఉంచిన అనుభవం ఉంది.అలాంటి విధానాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే అల్కాట్రాజ్ జైలును పునర్నిర్మించి తిరిగి ప్రారంభించాల్సిందిగా జైళ్లశాఖ, న్యాయశాఖ, ఎఫ్‌బీఐ, హోంలాండ్ సెక్యూరిటీ శాఖలకు ఆదేశాలు ఇచ్చాను'' అని తెలిపారు.
అల్కాట్రాజ్ జైలు ఒక ద్వీపంలో సముద్రం మధ్యలో ఉండటంతో అక్కడి నుండి బయటపడటం చాలా కష్టమైన పని.
వివరాలు
36 మంది ఖైదీలు మొత్తం 14 సార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఖైదీలు
పసిఫిక్ మహాసముద్రంలోని చల్లటి నీరు,బలమైన అలల మధ్య ఈ జైలు ఖైదీలకు నరకంతో సమానంగా భావించారు.
'ద రాక్' అనే పేరుతో ప్రసిద్ధిచెందిన ఈ జైలులో గ్యాంగ్‌స్టర్ అల్ కాపోన్,జార్జ్ మెషీన్ గన్ కెల్లీ వంటి అతి ప్రమాదకర నేరగాళ్లు ఉన్నారు.
ఈజైలును ఆధారంగా తీసుకుని పలు సినిమాలు కూడా రూపొందించబడ్డాయి.ఈ జైలు సుమారు 29 సంవత్సరాల పాటు (1934-1963) మాత్రమే పనిచేసింది.
ఈ సమయంలో అక్కడ నుండి తప్పించుకునేందుకు 36 మంది ఖైదీలు మొత్తం 14 సార్లు ప్రయత్నించారు.
అయితే వారందరినీ పట్టుకొని తిరిగి జైలులోనే పెట్టారు లేదా మరణించారు.
నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటంతో 1963లో ఈ జైలు అధికారికంగా మూసివేయబడింది. ప్రస్తుతం అల్కాట్రాజ్ ద్వీపం పర్యాటక కేంద్రంగా ఉపయోగించబడుతోంది.