Page Loader
India-Canada Row: కెనడా ఆరోపణలకు అమెరికా మద్దతు.. "సహకరించాలని" భారత్‌కి అభ్యర్థన
కెనడా ఆరోపణలకు అమెరికా మద్దతు.. "సహకరించాలని" భారత్‌కి అభ్యర్థన

India-Canada Row: కెనడా ఆరోపణలకు అమెరికా మద్దతు.. "సహకరించాలని" భారత్‌కి అభ్యర్థన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు మద్దతుగా అమెరికా స్వరం కలిపింది. ఆయన చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవనిగా అభివర్ణించింది. ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్‌ కేసు దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని అమెరికా కోరింది. అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ రోజువారీ ప్రెస్‌ బ్రీఫింగ్స్‌లో మాట్లాడుతూ, ''ఆ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కచ్చితంగా చెప్పగలిగాం. వాటిని భారత్‌ సీరియస్‌గా పరిగణించి కెనడాతో దర్యాప్తునకు సహకరించాలి. కానీ, న్యూదిల్లీ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఈ అంశంపై ఇరుదేశాలు బహిరంగంగా మాట్లాడితే తప్పనిసరిగా మరేమీ వ్యాఖ్యానించను'' అని వివరించారు. ఇరుదేశాల మధ్య సహకారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

వివరాలు 

భారత్‌-అమెరికా దౌత్య సంబంధాలపై మిల్లర్‌ కీలక వ్యాఖ్యలు

మరోవైపు, భారత్‌-అమెరికా దౌత్య సంబంధాలపై మిల్లర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బంధం చాలా బలంగా ఉందన్నారు. ''భారత్‌ మా శక్తిమంతమైన భాగస్వామిగా కొనసాగుతోంది. సమష్టి లక్ష్యాలు, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ వంటి పలు అంశాల్లో మేము కలిసి పనిచేస్తున్నాం. మా బంధంలో ఇరుదేశాలు తమ అభిప్రాయాలను సూటిగా వ్యక్తంచేసే పరిస్థితి ఉంది'' అని ఆయన అన్నారు. నిన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరిన్ని ఆరోపణలు చేశారు.సమస్యల పరిష్కారానికి న్యూదిల్లీ సహకరించడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధాలున్నాయని చెప్పేందుకు ప్రయత్నించారు.

వివరాలు 

భారత్‌-కెనడా వివాదంపై స్పందించిన న్యూజిలాండ్‌ విదేశాంగశాఖ మంత్రి 

ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆరుగురు కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలని, కెనడాలోని భారత దౌత్యాధికారులు స్వదేశానికి రమ్మంటూ భారత్‌ ప్రకటించిన నేపథ్యంలో, ట్రూడో హడావిడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ పౌరుల రక్షణ కోసం ఏం చేయడానికైనా వెనుకాడను అని పేర్కొన్నారు.మరోవైపు,న్యూజిలాండ్‌ విదేశాంగశాఖ మంత్రి విన్‌స్టన్‌ పీటర్స్‌ కూడా భారత్‌-కెనడా వివాదంపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ''దక్షిణాసియాకు చెందిన ప్రజలపై కెనడాలో జరుగుతున్న దాడులు,బెదిరింపులకు సంబంధించి క్రిమినల్‌ దర్యాప్తు గురించి కెనడా తెలియజేసింది. ఆ దేశ అధికారులు బహిరంగంగా చెబుతున్న నేరపూరిత ప్రవర్తన రుజువైతే అది ఆందోళనకరం. అదే సమయంలో,దర్యాప్తు అంశాలపై మేము వ్యాఖ్యానించను. చట్టం, న్యాయాన్ని గౌరవించడం చాలా ముఖ్యం'' అని పేర్కొన్నారు.