
Trump: సెప్టెంబర్‌లో పాకిస్థాన్ లో పర్యటించనున్న ట్రంప్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా పర్యటన చేపట్టాడు. ఈ పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో మునీర్‌కు ప్రత్యేక విందును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేసినట్టు మునీర్ వెల్లడించాడు. భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితిని ఆపినందుకు ట్రంప్‌కు మద్దతు ఇచ్చినట్లు మునీర్ పేర్కొన్నాడు. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సంబంధాల నేపథ్యంలో ట్రంప్ త్వరలోనే పాకిస్థాన్ పర్యటన చేపట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాయిటర్స్,పాకిస్థాన్‌కు చెందిన రెండు ప్రముఖ టెలివిజన్ న్యూస్ ఛానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి.
వివరాలు
2006లో జార్జ్ డబ్ల్యూ. బుష్ పాకిస్థాన్ పర్యటన
పాకిస్థాన్‌కు చెందిన సమా టీవీ కథనం ప్రకారం.. దక్షిణాసియా పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 18న ట్రంప్ ఇస్లామాబాద్‌ను సందర్శించనున్నారని తెలిపింది. అంతేకాకుండా, ట్రంప్ పాకిస్థాన్ పర్యటన ముగిసిన తర్వాత భారత్‌కు రావచ్చని కూడా పాకిస్థాన్ న్యూస్ ఛానెళ్లు రాయిటర్స్‌కు వెల్లడించాయని సమాచారం. ఇది నిజమైతే.. సుమారు రెండు దశాబ్దాల తర్వాత అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్‌ను సందర్శించిన ఘటనగా నమోదవుతుంది. చివరిసారిగా 2006లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ పాకిస్థాన్ పర్యటించారు. ఆయన తర్వాత పాకిస్థాన్‌ను సందర్శించే తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవుతారు. అయితే, ట్రంప్ పర్యటనపై తమకు అధికారిక సమాచారం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి రాయిటర్స్‌కు వెల్లడించారు.
వివరాలు
ప్రాధాన్యం సంతరించుకున్న ట్రంప్ పాకిస్థాన్ పర్యటన
ఇక ఏప్రిల్ 22న పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. దీనికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించింది. అనంతరం ట్రంప్ మీడియా ముందు భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ప్రకటించాడు. తన వల్లే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిందని వెల్లడించాడు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతం ట్రంప్ పాకిస్థాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.