Page Loader
UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా?
UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా?

UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి, ముఖ్యంగా భారతీయులకు, అనేక కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. పదేళ్ల పాటు నిలిచే దీర్ఘకాలిక నివాస అనుమతి ద్వారా యూఏఈలో స్థిరపడాలనుకునే వారు, వ్యాపార విస్తరణలు కోరుకునే వారు బాగా లాభపడుతున్నారు. స్థానిక స్పాన్సర్ అవసరం లేకుండానే అక్కడ నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పించడం వల్ల ఇది విస్తృతంగా ఆదరణ పొందుతోంది.

వివరాలు 

గోల్డెన్ వీసా అంటే ఏమిటి? - దాని ప్రత్యేకతలు 

యూఏఈ గోల్డెన్ వీసా అనేది దీర్ఘకాలిక నివాస వీసా.దీన్ని పొందిన వారు పదేళ్ల పాటు యూఏఈలో నివసించగలుగుతారు,స్వంతంగా వ్యాపారాలు నడపచ్చు లేదా ఉద్యోగాల్లో చేరవచ్చు. ఈ వీసా పొందేందుకు స్థానిక వ్యక్తుల సహాయం అవసరం ఉండదు. అంతేకాక,వీసా హోల్డర్లు తమ జీవిత భాగస్వామి,పిల్లలు వంటి కుటుంబ సభ్యులను కూడా స్పాన్సర్ చేయవచ్చు. కొంతమంది హోమ్ హెల్ప్ సిబ్బందిని కూడా ఈ వీసాతో కలుపుకోవచ్చు. వీసా హోల్డర్లు ఎక్కువకాలం విదేశాల్లో ఉన్నా,వారి నివాస హోదాపై ఎలాంటి ప్రభావం పడదు. యూఏఈకి ప్రయాణించడం,తిరిగి రావడం కూడా చాలా సులభం. పన్నుల పరంగా అనుకూల పరిస్థితులు, దుబాయ్ వంటి నగరాల్లో ఉన్న ఆధునిక మౌలిక వసతులు దీర్ఘకాలిక పెట్టుబడులకు, ఆస్తుల కొనుగోలుకు, స్థిర జీవనానికి ఎంతో తోడ్పడతాయి.

వివరాలు 

ఎవరు అర్హులు? 

ఈ గోల్డెన్ వీసా కోసం అనేక వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, నైపుణ్యం గల నిపుణులు (డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు), మెరుగైన ప్రతిభ కలిగిన విద్యార్థులు, తాజా గ్రాడ్యుయేట్లు, నెలకు 30,000 దిర్హామ్‌లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు అర్హత కలిగి ఉంటారు. వీరితో పాటు కళారంగంలో పనిచేసే కళాకారులు, రచయితలు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫాంలపై కంటెంట్ క్రియేటర్లకు కూడా ఈ వీసాలో స్థానం కల్పించారు. ప్రతి కేటగిరీకి తగిన అర్హతా ప్రమాణాలు ఉంటాయి. వాటిలో రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు వీసా పొందడం చాలా సులభంగా అందుబాటులో ఉండే మార్గంగా నిలిచింది.

వివరాలు 

దరఖాస్తు ప్రక్రియ వివరాలు 

మొదటిగా, అర్హత కలిగిన ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత దాని రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. తరువాత సంబంధిత భూ అధికార సంస్థల నుంచి టైటిల్ డీడ్ (హక్కుల పత్రం) పొందాలి. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్, లేదా సంబంధిత ఎమిరేట్ అధికారులతో పాటు, గోల్డెన్ వీసా కోసం దరఖాస్తును 'దుబాయ్ రెస్ట్' వంటి స్మార్ట్ యాప్ ద్వారా కూడా సమర్పించవచ్చు. దరఖాస్తు తర్వాత వైద్య పరీక్షలు, ఎమిరేట్స్ ఐడీ కోసం నమోదు వంటి ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని దస్తావేజులు సరిగా ఉంటే, పదేళ్ల కాలానికి గోల్డెన్ వీసా జారీ అవుతుంది. అర్హతలను కొనసాగించినపుడు, ఈ వీసాను మళ్లీ పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

భారతీయులకూ ఇతరులకూ ప్రయోజనాలు 

యూఏఈ భారతీయులకు ఒక ప్రధాన ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నైపుణ్యం కలిగినవారు ఇప్పటికే గోల్డెన్ వీసా ద్వారా దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో స్థిరపడి, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. వాణిజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. అంతేగాక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి వచ్చినవారు కూడా ఈ వీసాను అధికంగా స్వీకరిస్తున్నారు. తాత్కాలిక వీసాలు, వర్క్ పర్మిట్లకు బదులుగా ఇది సుస్థిరతను కలిగించే, సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారింది.