
WHO: 'ప్రజలు బాధపడుతున్నారు'.. గాజాపై ఇజ్రాయెల్ 'కరుణ' చూపించాలి : డబ్ల్యూహెచ్‌వో చీఫ్ విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ పోరులో గాజాపై ఇజ్రాయెల్ తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, అక్కడ సామాన్య పౌరులు భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ క్రమంలో గాజాలో గాజాలో ఆకలి సంక్షోభం తాండవిస్తోంది. ఈ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
శరణార్థులకు ఆహారం అందించడంలో నిర్లక్ష్యం చేయడం, ఆహారాన్ని ఆయుధంగా మలచడం నేరమని పేర్కొంది.
ఇజ్రాయెల్ కనీసం మానవతా దృష్టితో వ్యవహరించాలని కోరింది. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఈ విషయంపై భావోద్వేగభరితంగా స్పందించారు.
వివరాలు
ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం
"గాజాలోని ప్రజల బాధను పరిస్థితి ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. యుద్ధం వల్ల అక్కడి పరిస్థితులు భయంకరంగా మారాయి. ప్రజలు మానసికంగా,శారీరకంగా క్షోభ ఎదుర్కొంటున్నారు. వారు ఆకలితో బాధపడుతున్నారు. యుద్ధంలో ఆహారాన్ని ఆయుధంగా మలచడం మానవత్వానికి వ్యతిరేకం. అలాగే వైద్య సదుపాయాలను అడ్డుకోవడమూ తగదు. ఈ యుద్ధం ఇజ్రాయెల్‌కు కూడా ఉపశమనం ఇవ్వదు. శాశ్వత శాంతికి ఘర్షణలు మార్గం కావు. టెల్‌అవీవ్ నాయకత్వం గాజా ప్రజల పట్ల కనీస మానవత్వంతో స్పందించాలని కోరుతున్నా. ఇరు వర్గాల శాంతికై ఇదే మార్గం," అని టెడ్రోస్ స్పష్టం చేశారు.
వివరాలు
2.1 మిలియన్ల మంది జీవితాలు ప్రమాదంలో..
గాజాలో ఆకలి సంక్షోభం తీవ్రంగా ముదిరినట్లు డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వ్యవహారాల డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.
"ప్రస్తుతం గాజాలో ఉన్న 2.1 మిలియన్ల మంది ప్రజల జీవితం ప్రమాదంలో ఉంది. ప్రజల ఆకలిని తీర్చడం అత్యవసరం. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలి," అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా,గాజాలోని ఆస్పత్రుల స్థితిగతులపై ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థ నివేదిక బయటపడింది.
ప్రస్తుతానికి 94 శాతం ఆస్పత్రులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది. అందుబాటులో ఉన్న 36 ఆస్పత్రుల్లో కేవలం 19 మాత్రమే పనిచేస్తున్నాయి.
తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసినా అవి బాంబుల దాడులతో ధ్వంసమవుతున్నాయని పేర్కొంది.
సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరమని హెచ్చరించింది.
వివరాలు
53 వేల మంది మృతులు
గాజాలోకి 200 ట్రక్కులు ప్రవేశించినప్పటికీ, వాటిలో కేవలం 90 ట్రక్కుల మానవతా సహాయం మాత్రమే స్వచ్ఛంద సంస్థలకు చేరిందని యూఎన్ వివరించింది.
2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 53,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ పరిమిత మానవతా సహాయాన్ని మాత్రమే అనుమతిస్తున్నప్పటికీ, అది గాజా ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా మొత్తం తమ నియంత్రణలోకి తీసుకుంటామని ప్రకటించారు.
"మా పోరాటం అత్యంత తీవ్రమైన దశలో ఉంది. మేము పురోగమిస్తున్నాం. గాజా మొత్తం ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం. దీనిపై ఎలాంటి వెనుకడుగు లేదు," అని నెతన్యాహు స్పష్టం చేశారు.