
Donald Trump: ఏప్రిల్ 2 నుంచి ఆటోమొబైల్ పై కొత్త టారిఫ్‌లు: డొనాల్డ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే పరస్పర పన్నుల విషయంలో వెనుకడుగు వేయబోమని ప్రకటించారు. తాజాగా, మరో కీలక నిర్ణయాన్ని తీసుకునే యోచనలో ఉన్నారు. దిగుమతి చేసుకొనే కార్లపై సుంకాలను విధించే అవకాశముందని శుక్రవారం వెల్లడించారు. అయితే, అన్ని ఆటో మొబైల్ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తారా లేదా అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేయలేదు. దిగుమతి చేసుకొనే కార్లపై సుంకాలను విధించడం ద్వారా ఆదాయాన్ని పెంచడంతో పాటు, వాణిజ్య అసమతుల్యతను తగ్గించవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 2 నుండి ఆటోమొబైల్ ఉత్పత్తులపై టారిఫ్‌లు అమలులోకి రావొచ్చని సూచించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
వివరాలు
ఆటోమొబైల్ పరిశ్రమలో అనిశ్చితి
ప్రస్తుతం అమెరికాలో విక్రయించబడుతున్న కార్లలో దాదాపు 50 శాతం దేశీయంగా తయారవుతున్నాయి. మిగిలిన వాటిలో మెక్సికో,కెనడా వంటి దేశాల నుంచి అధికంగా దిగుమతులు జరుగుతున్నాయి. జపాన్,దక్షిణ కొరియా, జర్మనీ దేశాల నుంచి కూడా కొంతమేరకు కార్లను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, బ్రిటన్,ఇటలీ,స్వీడన్ నుంచి దిగుమతులు తక్కువగా ఉంటున్నాయి. ట్రంప్ సుంకాల విధింపు విధానంతో ఆటోమొబైల్ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఫోర్డ్ (Ford) సీఈఓ జిమ్ ఫర్లీ (Jim Farley) పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం సుంకాల పెంపు విధానం,ఎలక్ట్రిక్ వాహనాలపై వ్యతిరేక వైఖరి వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు. అమెరికాలో వాహన తయారీని ప్రోత్సహించాలని ట్రంప్ ప్రకటించినప్పటికీ,ఈ విధానంతో పరిశ్రమలో అనిశ్చితి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.