Swiggy IPO: అమితాబ్ బచ్చన్ నుండి కరణ్ జోహార్ వరకు.. స్విగ్గీ ఐపీలో ఎవరెవరు పెట్టుబడి పెట్టారంటే?
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) మొదటి పబ్లిక్ ఆఫర్ (IPO) కు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ ఐపీఓపై అందరి దృష్టి పడింది. స్టాక్ మార్కెట్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ఐపీఓలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. స్విగ్గీ ఐపీఓగా లిస్టింగ్ కాకముందే మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు 2,00,000 షేర్లను పలువురు ప్రముఖులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వారిలో భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్, టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న,ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, నటుడు ఆశిష్ చౌదరి స్విగ్గీ షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఫుడ్ డెలివరీ రంగంలో ఇప్పటికే ప్రముఖ సంస్థలు పెట్టుబడులు
గతంలో స్విగ్గీ నిర్వహించిన నిధుల సమీకరణలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ఇన్నోవ్ 8 వ్యవస్థాపకుడు రితేశ్ మాలిక్ కూడా భాగస్వాములు ఉన్నారు. ఫుడ్ డెలివరీ రంగంలో ఇప్పటికే ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్, యాక్సెల్, ప్రోసెస్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్ రామ్‌దేవ్ అగర్వాల్ కూడా పెట్టుబడి పెట్టారు. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌ను 2014లో స్థాపించారు.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 750 కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక
ఐపీఓ ద్వారా స్విగ్గీ 15 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022లో నిధులు సమీకరించినప్పుడు, స్విగ్గీ విలువ 10.7 బిలియన్ డాలర్లుగా ఉంది. స్విగ్గీ ఈ ఐపీఓ ద్వారా రూ. 10,414 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందులో రూ. 3,750 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా, రూ. 6,664 కోట్లు ఆఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 750 కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక ఉంది. ఏప్రిల్ 30న సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించారు. జొమాటో 2021లో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు 52 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయింది, తదుపరి కూడా వాటి షేర్లు బాగా రాణించాయి.