Page Loader
Boeing: చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్‌.. బోయింగ్‌ విమానాల డెలివరీలు తీసుకొవదంటూ చైనా ఆదేశాలు 
చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్‌.. బోయింగ్‌ విమానాల డెలివరీలు తీసుకొవదంటూ చైనా ఆదేశాలు

Boeing: చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్‌.. బోయింగ్‌ విమానాల డెలివరీలు తీసుకొవదంటూ చైనా ఆదేశాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం క్రమంగా మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే బీజింగ్ ప్రభుత్వం అరుదైన ఖనిజాలు,మాగ్నెట్లను ఎగుమతి చేయడం ఆపేసి వాషింగ్టన్‌ కు గట్టి ఝలక్‌ ఇచ్చింది. తాజాగా, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ప్రముఖ వైమానిక సంస్థ అయిన బోయింగ్ నుంచి ఇకపై ఎలాంటి విమాన డెలివరీలను స్వీకరించవద్దని అక్కడి దేశీయ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ తన నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా, విమాన రంగానికి అవసరమైన విడిభాగాలను కూడా అమెరికా నుంచి కొనుగోలు చేయొద్దని సూచించింది.

వివరాలు 

ఆ సంస్థలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేందుకు చైనా ప్రభుత్వం చర్యలు

ఇప్పటికే అమెరికా నుండి దిగుమతయ్యే వస్తువులపై 125 శాతం సుంకాలు విధిస్తూ చైనా తాజా ప్రకటన చేసింది. దీని ఫలితంగా, బోయింగ్‌ విమానాల్లో వాడే విడిభాగాల దిగుమతి కూడా తాత్కాలికంగా నిలిపివేయాల్సి రావచ్చని సంస్థలకు సూచించింది. ఈ నిర్ణయం వల్ల చైనా సంస్థలు బోయింగ్‌ విమానాల నిర్వహణలో అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి ప్రతిస్పందనగా, బోయింగ్‌ విమానాలను లీజుకు తీసుకుని ఇప్పటికే ఉపయోగిస్తున్న సంస్థలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

వివరాలు 

చైనా నుంచి బోయింగ్‌కు కొత్త ఆర్డర్లు రావడం లేదు

ఈ వాణిజ్య యుద్ధం కారణంగా బోయింగ్‌ సంస్థ స్థితి మరింత అస్థిరంగా మారింది. గత కొంత కాలంగా నష్టాల్లో కొనసాగుతోన్న ఈ సంస్థకు చైనా ప్రధాన మార్కెట్‌గా ఉండటంతో, తాజా పరిణామాలు మరింత అగమ్య గోచరంగా మారింది. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా విమానాల విపణిలో సుమారు 20 శాతం వాటా చైనాకే చేరుతుందని అంచనాలున్నాయి. 2018 సంవత్సరంలోనే బీజింగ్‌కు చెందిన సంస్థలు బోయింగ్‌ విమానాల్లో 25 శాతం వాటాను కొనుగోలు చేశాయి. అయితే వాణిజ్య సంబంధాల ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా చైనా నుంచి బోయింగ్‌కు కొత్త ఆర్డర్లు రావడం లేదు.

వివరాలు 

చైనా మినహాయించి ఇతర దేశాలకు 90 రోజుల పాటు మినహాయింపు

ఇక, అమెరికా చైనా వస్తువులపై 145 శాతం దిగుమతి సుంకాన్ని విధించగా.. చైనా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. అగ్రరాజ్యం నుండి దిగుమతయ్యే వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. ఈ పరిణామాలతో ప్రపంచంలోని అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ట్రంప్ పాలనలో విధించిన టారిఫ్‌లకు ప్రతిగా చైనా తీసుకున్న ఈ చర్యలతో.. అమెరికాలో చైనా నుండి దిగుమతయ్యే వస్తువుల ధరలు ఇతర దేశాలవి కన్నా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రతిఘటించని ఇతర దేశాలకు 90 రోజుల పాటు మినహాయింపు ఇవ్వడం గమనార్హం.