Page Loader
NITI Ayog Report: చైనా,కెనడా,మెక్సికోలపై సుంకాలతో అమెరికాకు భారత్‌ ఎగుమతులు పెరుగుతాయ్‌: నీతిఆయోగ్‌ నివేదిక 
చైనా,కెనడా,మెక్సికోలపై సుంకాలతో అమెరికాకు భారత్‌ ఎగుమతులు పెరుగుతాయ్‌: నీతిఆయోగ్‌ నివేదిక

NITI Ayog Report: చైనా,కెనడా,మెక్సికోలపై సుంకాలతో అమెరికాకు భారత్‌ ఎగుమతులు పెరుగుతాయ్‌: నీతిఆయోగ్‌ నివేదిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు భారత్‌ మరింత పోటీతత్వంగా ఎగుమతులు చేసే అవకాశాలు లభించాయని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై అమెరికా ప్రభుత్వం అధిక టారిఫ్‌లు విధించడమే భారతానికి అనుకూలించనుందని సోమవారం విడుదల చేసిన 'ట్రేడ్‌ వాచ్‌ క్వార్టర్లీ' నివేదికలో తెలిపింది. అమెరికా మార్కెట్లో ఉత్పత్తుల సంఖ్య, పరిమాణ పరంగా భారత్‌కు విశేష అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఆ నివేదికలో మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి:

వివరాలు 

ఆయా దేశాలతో టారిఫ్‌ అంతరమే కారణం 

మొత్తం 30 ప్రధాన విభాగాల్లో (హెచ్‌ఎస్‌ 2 స్థాయిలో) 22 విభాగాల్లో భారత్‌కు ప్రయోజనం దక్కనున్నట్టు పేర్కొంది. ఈ విభాగాల మార్కెట్‌ పరిమాణం 2285.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ విభాగాల్లో చైనా, కెనడా, మెక్సికో దేశాలు ముఖ్య ఎగుమతిదార్లు. ఈ దేశాలపై అమెరికా వరుసగా 30%, 35%, 25% టారిఫ్‌లు విధించడం భారతానికి లాభంగా మారనుంది. టారిఫ్‌ ప్రయోజనం కారణంగా అమెరికా మార్కెట్లో భారత మార్కెట్‌ వాటా పెరగనుందని పేర్కొంది. ఫార్మా, జౌళి, విద్యుత్‌ యంత్రాంగ విభాగాల్లో భారత ఉనికిని మరింత పెంచుకునే అవకాశం ఉందని వివరించింది.

వివరాలు 

అమెరికాకు భారత ఎగుమతుల వాటా 32.8%

మరో 6 విభాగాల్లో పోటీతత్వ పరంగా భారత్‌కు ప్రస్తుత పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. అయితే ఈ విభాగాల్లో అమెరికాకు భారత ఎగుమతుల వాటా 32.8% కాగా, అమెరికా మొత్తం దిగుమతుల్లో 26% లేదా 26.5 బిలియన్‌ డాలర్లకు సమానమని పేర్కొంది. భారత ఎగుమతుల్లో 52% వాటాను కలిగించే 78 ఉత్పత్తుల్లో, అమెరికా మొత్తం దిగుమతుల్లో 26% వాటా ఉన్న ఉత్పత్తుల్లో భారత్‌కు పోటీ ప్రయోజనం లభించనుందని తెలిపింది. చైనా, కెనడా, మెక్సికో దేశాలపై ఉన్న అధిక టారిఫ్‌లు కారణంగా ఖనిజాలు, ఇంధనాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్‌, సముద్ర ఉత్పత్తులు వంటి విభాగాల్లో 1,265 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌లో భారత్‌ లాభం పొందనుందని నివేదికలో పేర్కొన్నారు.

వివరాలు 

ఒప్పందంలో కీలక అంశాలు ఉండాలని సూచన 

'భారత్‌-బ్రిటన్‌ ఒప్పందం తరహాలో, అమెరికాతో సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందాన్ని భారత్‌ కుదుర్చుకోవాలి. ఐటీ, ఆర్థిక సేవలు, ప్రొఫెషనల్‌ సేవలు, విద్య వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల ప్రక్రియను మెరుగుపరిచేలా చర్చలు జరపాలి' అని నీతిఆయోగ్‌ సూచించింది.

వివరాలు 

గురువారం వరకు చర్చలు కొనసాగనున్నాయి 

తాజా చర్చల కోసం భారత వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్)పై సోమవారం ప్రారంభమైన చర్చలు గురువారం ముగియనున్నాయి. వ్యవసాయం, వాహన రంగాల్లో సమస్యలను ఇరు దేశాలు పరిష్కరించుకునే అవకాశం ఉందని అంచనా. భారత్‌తో పాటు పలు దేశాలపై అదనపు టారిఫ్‌లు విధించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం ఆగస్టు 1 వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

వివరాలు 

భారత్‌కు భారీ అవకాశాలు ఉన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ విశ్లేషణ 

అమెరికాతో ఒప్పందం అనుకున్న విధంగా నెరవేరినా, నెరవేరకపోయినా, లేదా భారత్‌పై మరో 10% అదనపు టారిఫ్‌ వేసినా కూడా భారత్‌కు ఎగుమతులు పెంచుకునే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తెలిపింది. ఎగుమతుల విషయంలో భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొంది.