
Maruti Suzuki market share: హ్యుందాయ్ మోటార్స్‌కు షాకిచ్చిన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఏప్రిల్ నెలలో రెండో స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
మారుతీ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న హ్యుందాయ్ మోటార్స్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ నుంచి పెద్ద షాక్ తగిలింది.
హ్యుందాయ్‌ను నాలుగో స్థానానికి పడగొట్టి మహీంద్రా రెండో స్థానాన్ని ఆక్రమించింది.
ఇక దేశీయ కార్ల మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ మార్కెట్ వాటా 40 శాతం దిగువకు పడిపోయింది.
టాటా మోటార్స్ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.ఈ వివరాలు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ (FADA) ఏప్రిల్ నెల గణాంకాలను విడుదల చేసిన సందర్భంలో వెలుగు చూశాయి.
ఏప్రిల్ 2025లో దేశవ్యాప్తంగా మొత్తం 3.49 లక్షల పాసింజర్ వాహనాలు విక్రయమయ్యాయి.
ఇది గతేడాది ఏప్రిల్ నెలలో నమోదైన 3.44 లక్షల విక్రయాలతో పోలిస్తే 1.55 శాతం పెరుగుదలగా ఫాడా వెల్లడించింది.
వివరాలు
40 శాతం పైగా మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో మారుతీ సుజుకీ
మారుతీ సుజుకీ సంస్థ ఏప్రిల్ నెలలో 1,38,021 కార్లను విక్రయించింది.ఇది మొత్తం పాసింజర్ వాహనాల మార్కెట్‌లో 39.44 శాతం వాటాను సూచిస్తుంది.
గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 1,39,173 కార్లను విక్రయించి 40.39 శాతం మార్కెట్ వాటా నమోదు చేసుకుంది.
2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఈ సంస్థ 40 శాతం పైగా మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది.
కానీ తాజా గణాంకాల్లో కంపెనీ మార్కెట్ వాటా 40 శాతానికి దిగువకు రావడం ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం.
ఎస్‌యూవీ విభాగంలో విస్తృతంగా వాహనాలను విక్రయిస్తూ వస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఏప్రిల్ నెలలో 48,405 వాహనాలను విక్రయించింది.
వివరాలు
నాలుగో స్థానానికి పరిమితమైన హ్యుందాయ్ మోటార్
దీని ద్వారా సంస్థ 13.83 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
గతేడాది ఇదే నెలలో ఈ సంస్థ 38,696 వాహనాలను విక్రయించి 11.23 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో నిలిచింది.
ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ మార్కెట్ వాటా 12.33 శాతంగా, 2023-24లో 10.70 శాతంగా ఉండేది.
ఇంతకుముందు రెండో స్థానంలో ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం నాలుగో స్థానానికి పరిమితమైంది.
ఏప్రిల్ నెలలో సంస్థ 43,642 వాహనాలను విక్రయించి 12.47 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
వివరాలు
స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయవంతమైన టాటా
గతేడాది ఇదే సమయంలో 49,243 వాహనాల విక్రయాలతో 14.29 శాతం మార్కెట్ వాటాను నమోదు చేస్తూ రెండో స్థానంలో నిలిచింది.
2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో హ్యుందాయ్ వరుసగా 13 శాతం, 14 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో కొనసాగింది.
ఇక టాటా మోటార్స్ విషయానికొస్తే, ఏప్రిల్ నెలలో 44,065 వాహనాలను విక్రయించి 12.59 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానాన్ని సంపాదించింది.
గతేడాది ఇదే నెలలో సంస్థ 46,915 యూనిట్లను విక్రయించి 13.61 శాతం మార్కెట్ వాటాతో హ్యుందాయ్‌కు తరువాత మూడో స్థానంలో నిలిచింది.
ఈ ఏడాది కూడా టాటా తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయవంతమైంది.