LOADING...
Russia: భారతీయ కంపెనీలకు రష్యా చమురు మరింత చౌక.. అమెరికా ఒత్తిళ్ల మధ్య రికార్డు దిగుమతులు..!
అమెరికా ఒత్తిళ్ల మధ్య రికార్డు దిగుమతులు..!

Russia: భారతీయ కంపెనీలకు రష్యా చమురు మరింత చౌక.. అమెరికా ఒత్తిళ్ల మధ్య రికార్డు దిగుమతులు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ కంపెనీలకు రష్యా నుంచి చమురు మరింత తక్కువ ధరలో లభిస్తోంది. తాజా వివరాల ప్రకారం బ్రెంట్‌ చమురుతో పోలిస్తే రష్యా చమురు బ్యారెల్‌కు సుమారు 3 నుంచి 4డాలర్ల వరకు చౌకగా లభిస్తున్నట్లు సమాచారం. రష్యా గ్రిడ్‌ నుంచి చమురు ఆఫర్లు పొందిన వ్యక్తులు ఒక అంతర్జాతీయ వార్తాసంస్థకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈతగ్గింపు ధరలు సెప్టెంబర్‌ చివరి వారం నుంచి అక్టోబర్‌ లో జరిగే సరఫరాలకు వర్తిస్తాయని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా,భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. గత వారం రష్యా ఉరల్స్‌ గ్రేడ్‌ చమురుపై బ్యారెల్‌కు 2.5డాలర్ల తగ్గింపు లభించగా,జులైలో ఈ రాయితీ కేవలం 1డాలర్‌కే పరిమితమైంది.

వివరాలు 

 పశ్చిమ పోర్టుల నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు సరఫరా 

మరోవైపు అమెరికా నుంచి వచ్చే చమురు ధర సాధారణ స్థాయికంటే ఎక్కువగానే ఉంది. బ్రెంట్‌తో పోలిస్తే అది బ్యారెల్‌కు 3 డాలర్లు అధికంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. రష్యా ఎగుమతి చేసే ప్రధాన చమురులో ఉరల్స్‌ ఒకటి.ఇది అక్కడి పశ్చిమ పోర్టుల నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు సరఫరా అవుతుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సముద్ర మార్గం ద్వారా ఈ చమురును దిగుమతి చేసుకొనే దేశాల్లో భారత్‌ ముందంజలో నిలిచింది. అమెరికా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. జులై నెలలోనే రష్యా భారత్‌కు 3.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.31,775 కోట్లు) విలువైన చమురును విక్రయించింది.

వివరాలు 

ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై అదనంగా 25% టారిఫ్‌ 

ఆ నెలలో భారత్‌ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 31.4% ఉండగా,రెండో స్థానంలో ఇరాక్‌ (17.1%), మూడో స్థానంలో సౌదీ అరేబియా (16.1%), నాల్గవ స్థానంలో యూఏఈ (11.8%) నిలిచాయి. రష్యా నుంచి పెరిగిన దిగుమతుల కారణంగా అమెరికా ప్రభుత్వం ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై అదనంగా 25% టారిఫ్‌ విధించింది. దీంతో మొత్తం టారిఫ్‌ రేటు 50%కు చేరింది. ఇదిలా ఉండగా, జులైలో భారత్‌ అమెరికా నుంచి 8.9% మేర చమురును దిగుమతి చేసుకోవడం విశేషంగా మారింది.