
Tesla: టెస్లా భారత ప్రవేశం.. జులై 15న ముంబైలో షోరూం ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టడం ఖాయమైంది. భారతదేశంలో తమ వాహనాలను విక్రయించేందుకు టెస్లా కంపెనీ జూలై 15న ముంబయిలో తమ తొలి షోరూమ్‌ను ప్రారంభించనుందని సమాచారం. ఈ షోరూమ్ ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే టెస్లా సంస్థ ముంబయికి ఐదు మోడల్ వై వాహనాలను చైనా దేశంలోని షాంఘై నగరం నుంచి దిగుమతి చేసుకువచ్చినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ షోరూమ్ తర్వాత ఢిల్లీలో కూడా మరో ప్రదర్శన కేంద్రాన్ని స్థాపించాలనే ఆలోచనలో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాలు
భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా 2021 నుంచే ప్రయత్నాలు
భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా 2021 నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, కంపెనీ చేసిన ప్రధాన డిమాండ్ ఏమిటంటే- ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక నిబంధనను విధించింది. టెస్లా దేశీయంగా వాహనాలను ఉత్పత్తి చేయడమే కాకుండా, అవసరమైన విడిభాగాలను భారతీయ సరఫరాదారుల నుంచే కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. అయితే ఈ షరతులపై మస్క్‌కు అభ్యంతరాలు ఉండటంతో టెస్లా ఇండియాలో ప్రవేశం ఆలస్యమైంది.
వివరాలు
టెస్లా భారత్‌లో షోరూమ్‌ల ఏర్పాటుపై ఆసక్తి
ఇటీవలి కాలంలో, ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఎలాన్ మస్క్‌తో సమావేశం అయ్యారు. ఆభేటీలో దిగుమతి సుంకాల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.ఈసమావేశం అనంతరం భారత ప్రభుత్వం హైఎండ్ ఎలక్ట్రిక్ కార్లపై ఉన్న ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ముఖ్యంగా,40వేలడాలర్ల(దాదాపు రూ.34 లక్షలు)కంటే అధిక ధర ఉన్న కార్లపై ఈ తగ్గింపు వర్తించనుంది. ఈ నిర్ణయం టెస్లా సంస్థకు భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు మరింత అనుకూల పరిస్థితులు కల్పించింది. అయితే టెస్లా భారత్‌లో షోరూమ్‌ల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నప్పటికీ,వాహనాలను దేశీయంగా ఉత్పత్తి చేయాలన్న దిశగా పెద్దగా మొగ్గుచూపడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈవిషయాన్ని ఇటీవల కేంద్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.