Page Loader
Economic Survey: ఎకనామిక్ సర్వే అంటే ఏంటీ..?దానిని కేంద్ర బడ్జెట్‌కు ముందు ఎందుకు ప్రవేశపెడతారు?
ఎకనామిక్ సర్వే అంటే ఏంటీ..?దానిని కేంద్ర బడ్జెట్‌కు ముందు ఎందుకు ప్రవేశపెడతారు?

Economic Survey: ఎకనామిక్ సర్వే అంటే ఏంటీ..?దానిని కేంద్ర బడ్జెట్‌కు ముందు ఎందుకు ప్రవేశపెడతారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టటానికి ఒక రోజు ముందు శుక్రవారం ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఈ సర్వే గత ఏడాదిలో ప్రభుత్వ పనితీరుపై సమగ్ర విశ్లేషణను అందించే వివరణాత్మక రిపోర్టు లాంటిది. సర్వేలో జీడీపీ, వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి వంటి కీలక అంశాలను వివరించబడుతుంది. అలాగే, కొత్త ఆర్థిక అవకాశాలు, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను చర్చిస్తాయి. ఆర్థిక పురోగతిని అడ్డుకుంటున్న అంశాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ సర్వే తెలియజేస్తుంది.

వివరాలు 

పెట్టుబడిదారులకు ఈ సర్వే చాలా ఉపయోగకరం

దేశ ఆర్థిక వ్యవస్థ సరైన వేగంతో నడిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ సర్వేలో హైలైట్‌ చేస్తారు. ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ప్రధాన ఆధారంగా పరిగణిస్తారు.సాధారణ ప్రజల దృష్టిలో,ఆర్థిక సర్వే ద్రవ్యోల్బణం,నిరుద్యోగం వంటి ముఖ్యమైన విషయాలపై సమాచారం అందిస్తుంది. పెట్టుబడులు, పొదుపు,ఖర్చుల విషయంలో అవగాహన పెంచేందుకు సహాయపడుతుంది. పెట్టుబడిదారులకు ఈ సర్వే చాలా ఉపయోగకరంగా ఉంటుంది,ఎందుకంటే ఇది పెట్టుబడికి మంచి అవకాశాలను గుర్తించడంలో దోహదం చేస్తుంది. ఈ ఆర్థిక సర్వేను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది దేశం ఆర్థిక స్థితి గురించి కీలకమైన డేటాను అందిస్తుంది. ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఇతర వాటాదారులు వచ్చే ఏడాది ప్రభుత్వ ఆర్థిక వ్యూహాలను అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది.

వివరాలు 

ఆర్థిక సర్వే రెండు భాగాలు

ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల శాఖ తయారు చేస్తుంది. ఇది గత సంవత్సరంలో భారతదేశ ఆర్థిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ముఖ్యమైన పరిశ్రమలు, వ్యవసాయం, సర్వీసులపై సమాచారాన్ని అందించి, ముఖ్యమైన ఆర్థిక సూచికలను మూల్యాంకనం చేస్తుంది. సాధారణంగా ఆర్థిక సర్వే రెండు భాగాలుగా తయారవుతుంది. మొదటి భాగంలో ఆర్థిక ధోరణులు, అభివృద్ధి, రంగాల పనితీరుపై దృష్టి పెడుతుంది. రెండవ భాగంలో పేదరికం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ ఆందోళనలు, వాణిజ్య సమతుల్యత, విదేశీ మారక నిల్వలు వంటి అంశాలను చర్చిస్తారు.

వివరాలు 

1950-51లో మొదటిసారి ఆర్థిక సర్వే

ఈ సర్వే ప్రధాన ఆర్థిక సలహాదారుల నేతృత్వంలో తయారవుతుంది. సీఈఏ, ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, వివిధ విభాగాలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుండి డేటా సేకరించి, విస్తృత నివేదికను రూపొందిస్తారు. నివేదిక తయారయ్యాక, బడ్జెట్‌ సమావేశాలకు ఒక రోజు ముందు పార్లమెంట్‌లో ఈ సర్వేను ప్రవేశపెడతారు. 1950-51లో మొదటిసారి ఆర్థిక సర్వే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రారంభం రోజునే బడ్జెట్‌తో పాటు ప్రవేశపెడతారు. 1964 నుంచి బడ్జెట్‌కు ముందురోజు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది.