Page Loader
AAA: వైజాగ్‌లో అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్.. దిల్ రాజు గడ్డపై బన్నీ జెండా
వైజాగ్‌లో అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్.. దిల్ రాజు గడ్డపై బన్నీ జెండా

AAA: వైజాగ్‌లో అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్.. దిల్ రాజు గడ్డపై బన్నీ జెండా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత కాలంలో ప్రముఖ నగరాల్లో మల్టీప్లెక్స్ థియేటర్ల సంఖ్య దశలవారీగా పెరుగుతున్నవిషయం తెలిసిందే. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ హీరోలు, ప్రముఖ సంస్థ అయిన ఏషియన్ సినిమాస్‌తో చేతులు కలిపి మల్టీప్లెక్స్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. నటుడు మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ హైదరాబాద్‌లో విజయవంతంగా నడుస్తోంది. ఇక అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ నిర్మాణాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడు. హైదరాబాద్‌ లోని అమీర్‌పేట ప్రాంతంలో ఉన్న సత్యం థియేటర్‌ కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకుని, సునీల్ నారంగ్‌తో కలిసి 'ఏఏఏ' (Triple A) పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ థియేటర్‌కు మంచి స్పందన లభించడంతో, అల్లు అర్జున్ ఇప్పుడు ఇదే తరహా ప్రాజెక్ట్‌ను విశాఖపట్టణంలో చేపట్టడానికి సిద్ధమవుతున్నాడు.

వివరాలు 

హీరోలంతా ఇప్పుడు థియేటర్ యజమానులు

విశాఖపట్నంలోని ఇన్ ఆర్బిట్ మాల్‌లో ఎనిమిది స్క్రీన్లు ఉండే మల్టీప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి తాజా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.వచ్చే వేసవిలో ఈ థియేటర్ ప్రారంభమయ్యేలా లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఇప్పటికే మహేష్ బాబు,రవితేజ, విజయ్ దేవరకొండలతో కలిసి మల్టీప్లెక్స్ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరంతా ఇప్పుడు థియేటర్ యజమానులుగా మారిపోయారు. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ 'దిల్' రాజు ప్రభావం గల ఉత్తరాంధ్రలో అడుగుపెడుతుండటం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో దిల్ రాజు సినిమాల పంపిణీలో ప్రముఖుడిగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి స్థలంలో అల్లు అర్జున్,సునీల్ నారంగ్‌తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వివరాలు 

స్క్రీన్ కౌంట్ తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న నిర్మాతలు 

దిల్ రాజు ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో అల్లు అర్జున్ తన పట్టు స్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుండగా, ఆయన ప్రణాళికలు సాధారణంగా ఉండవని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్క్రీన్ కౌంట్ తగ్గిపోవడం వల్ల నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో, స్టార్ హీరోలు స్వయంగా థియేటర్లు నిర్మించడం మల్టీప్లెక్స్ రంగానికి కొత్త ఊపునిస్తుందని పరిశ్రమలో పలువురు భావిస్తున్నారు.