
Uttar Pradesh: ₹49వేల కోట్ల కుంభకోణం.. పెర్ల్ ఆగ్రో-టెక్ మాజీ డైరెక్టర్ అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయల మోసం కేసులో పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ (PACL) మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ (69)ను ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 10 రాష్ట్రాల్లో జరిగిన భారీ స్కాం కాగా,మొత్తం మోసపోయిన మొత్తం రూ.49,000 కోట్లకు పైగా ఉంది. అధికారుల వివరాల ప్రకారం, 2011లో "గుర్వంత్ ఆగ్రోటెక్ లిమిటెడ్" పేరుతో ఉన్న సంస్థను "పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్"గా మార్చారు. అనంతరం ఈ సంస్థ తన కార్యకలాపాలను పది రాష్ట్రాల్లో విస్తరించింది. అయితే, ఈ కంపెనీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి అవసరమైన అనుమతులు లేకుండానే బ్యాంకింగ్ సేవలను నిర్వహిస్తూ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించింది.
వివరాలు
బాండ్లు, రశీదులు ధ్రువపత్రాలు జారీ
ఈ క్రమంలో, కంపెనీ అధికారులు ప్రజలకు ఆకర్షణీయమైన వాగ్ధానాలతో పెట్టుబడులు పెట్టించారు. డిపాజిట్లు చేస్తే అధిక లాభాలు వస్తాయని, భవిష్యత్‌లో భూములు కేటాయిస్తామని ఆశ చూపారు. ఇందుకోసం బాండ్లు, రశీదులు వంటి ధ్రువపత్రాలు కూడా జారీ చేశారు. ఈ విధంగా ఉత్తరప్రదేశ్, అస్సాం, పంజాబ్, దిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి పది రాష్ట్రాల్లోని వేలాది మంది నుంచి భారీగా డబ్బును వసూలు చేశారు. అయితే చివరికి పెట్టుబడిదారులకు వాగ్దానం చేసినట్లు లాభాలూ ఇవ్వకుండా, భూములూ కేటాయించకుండా వారిని మోసం చేశారు.
వివరాలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నేరాల విభాగానికి కేసు అప్పగింత
ఈ భారీ మోసంపై నమోదైన కేసును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించింది. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితుల్లో ఒకరైన గుర్నామ్ సింగ్‌ను తాజాగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే 2012 నుంచి 2015 మధ్యకాలంలో అతనిపై ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. 2016లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అతడిని అరెస్ట్ చేసినా, ఆరునెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి సుమారు తొమ్మిదేళ్లపాటు పరారీలో ఉంటూ రహస్యంగా జీవనం గడిపాడు. కాగా, ఈ కేసులో మరో నలుగురు నిందితులు ఇప్పటికే జైలులో ఉన్నారు.