
అలా చేస్తే రాజస్థాన్‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 'వన్ ఆన్ వన్' వ్యూహంతో బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.
ఈ అంశంపై తాజాగా ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటే, రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో తాము రేసు నుంచి తప్పుకుంటామని భరద్వాజ్ తెలిపారు.
'వన్ ఆన్ వన్' వ్యూహం అంటే, లోక్‌సభ బరిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి నుంచి ఒక అభ్యర్థి మాత్రమే బరిలో నిలబడుతారు.
అది కూడా ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న రాజకీయ పార్టీ నుంచి మాత్రమే అభ్యర్థులు నిలబడతారు. మిగతా పార్టీలు పోటీ చేస్తున్న వారికి మద్దతుగా నిలవాల్సి ఉంటుంది.
ఆప్
మోదీ మళ్లీ గెలిస్తే రాచరిక పాలన
2024లో మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపిస్తే దేశం రాచరిక పాలనగా మారుతుందని సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు.
మోదీ మళ్లీ ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందన్నారు. అతను జీవించి ఉన్నంత వరకు దేశానికి రాజుగా తనను తాను ప్రకటించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను కేంద్రం ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఆప్ పథకాలను కాపీ కొడుతుందని భరద్వాజ్ ఆరోపించారు. ఒకప్పుడు ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల కోసం అపహాస్యం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నట్లు భరద్వాజ్ అన్నారు.