Ap Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ ఆందోళన.. సమావేశాల బహిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
ఈ సమావేశాలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే, వైసీపీ సభ్యులు నినాదాలు మొదలుపెట్టారు.
నిరసనల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభలో ప్రతిపక్ష హోదా కల్పించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
"ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి" అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ, వైసీపీ సభ్యులు సభను బహిష్కరించారు.
అయితే, అసెంబ్లీ ప్రారంభమైన 11 నిమిషాల వరకు జగన్ సభలో పాల్గొన్నారు.
వివరాలు
"నరేంద్ర చంద్రబాబు"
గవర్నర్ ప్రసంగంలో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే కూటమికి అపూర్వమైన మెజారిటీ ఇచ్చారని, ఇది చంద్రబాబు నాయుడు నాయకత్వంపై, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నాయకత్వంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
ప్రసంగ ప్రారంభంలో గవర్నర్, చంద్రబాబును "నరేంద్ర చంద్రబాబు"గా పేర్కొనడం విశేషం.
గత ప్రభుత్వం పాలనలో తలెత్తిన అవకతవకలను గవర్నర్ అసెంబ్లీలో వివరించారు.
2019-24 మధ్య జరిగిన దుర్వినియోగ పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ పతనానికి గురైందని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు ఏడు శ్వేతపత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు.
వివరాలు
"సూపర్ సిక్స్" హామీల అమలు
ఈ శ్వేతపత్రాల్లో రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో భారీ దుర్వినియోగం,సహజ వనరుల దోపిడీ,ఎక్సైజ్, ఇసుక మైనింగ్‌లో లోపభూయిష్ట విధానాలు,ప్రభుత్వ రుణ పాలసీల కారణంగా 25 ఏళ్ల భవిష్యత్ ఆదాయ నష్టం,పెండింగ్ అప్పులు రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోవడం వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి.
ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యమైన పనుల్లో "సూపర్ సిక్స్" హామీల అమలు ప్రధానంగా ఉంది.
ఇందులో భాగంగా పెన్షన్లను రూ.4,000కి పెంచడం, 16,347 ఉపాధ్యాయుల భర్తీకి మెగా DSC, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ,ఉచిత ఇసుక విధానం,గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి,గుంతలు లేని రోడ్ల లక్ష్యం వంటి చర్యలు చేపట్టింది.
ఎన్డీయే హామీ ప్రకారం, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో 12.94% వృద్ధి
పోలవరం ప్రాజెక్టు,స్టీల్ ప్లాంట్,రైల్వే జోన్,ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు.
గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టాటా పవర్, TCS వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు.
ఇప్పటి వరకు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందం కుదిరాయి, దీని ద్వారా 4 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర జీడీపీ రూ.16 లక్షల కోట్లకు చేరుకోవచ్చని, తలసరి ఆదాయం రూ.2.68 లక్షలకు పెరుగుతుందని వివరించారు.
వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో 12.94% వృద్ధి నమోదైందని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల ప్రోత్సాహం, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర పురోగతికి దోహదపడతాయని గవర్నర్ తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు.