Page Loader
Amaravati: అమరావతి రాజధాని నిర్మాణంలో ముందడుగు.. రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం 
అమరావతి రాజధాని నిర్మాణంలో ముందడుగు.. రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

Amaravati: అమరావతి రాజధాని నిర్మాణంలో ముందడుగు.. రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ కార్యకలాపాలకు గణనీయమైన పురోగతి లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రెండు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కోసం ఉమ్మడి కేంద్ర కార్యాలయ సముదాయం (కామన్ సెంట్రల్ సెక్రటేరియట్) నిర్మించడమేకాకుండా, అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం నివాస సముదాయాన్ని (జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్) కూడా రూపొందించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ రెండు ప్రాజెక్టులకూ కలిపి రూ.2,787 కోట్లు ఖర్చు చేయనున్నారు.ఇందులో కేంద్ర కార్యాలయ సముదాయం నిర్మాణానికి రూ.1,458 కోట్లు,ఉద్యోగుల నివాస గృహ సముదాయానికి రూ.1,329 కోట్లు కేటాయించారు. ఈ ప్రతిపాదనలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి వచ్చినవిగా,వాటికి ఆర్థికశాఖ ఆమోదం తెలిపి మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

నిర్మాణ పనులను చేపట్టనున్న కేంద్ర ప్రజాపనుల విభాగం 

ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో వెల్లడించారు. ఈ నిర్మాణ పనులను కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) చేపట్టనుంది. ఈ సందర్భంగా 2018లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కాలంలోనే సీపీడబ్ల్యూడీకి 22.53 ఎకరాల భూమిని అమరావతిలో కేటాయించిన విషయం గుర్తుచేసుకోవాలి. ఇందులో 5.53ఎకరాలు గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)పరిధిలో ఉండగా,మిగిలిన 17 ఎకరాలు బయట ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమరావతిపై దురుద్యేశ తత్వంతో చర్యలు చేపట్టింది. మూడు రాజధానుల నినాదంతో రాష్ట్రంలో అస్థిరత నెలకొల్పడంతో పాటు కోర్టుల్లో వివాదాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కూడా నిర్మాణ పనుల్లో ముందుకు రావడం లేదు.

వివరాలు 

కేంద్ర కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో..

2024లో ఎన్నికల అనంతరం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి రావడంతో, అమరావతిలో నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపింది.భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సైతం గతంలో చేసిన 22.53 ఎకరాల కేటాయింపునకు మళ్లీ ఆమోదం తెలిపింది. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వ శాఖలకు రాజధానిలో విడివిడిగా భూములు కేటాయించగా,ఇప్పుడు ఆ విధానాన్ని విరమించి అన్ని కేంద్ర కార్యాలయాలనూ ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఉద్దేశించారు. ఈ మేరకు ఉమ్మడి కేంద్ర కార్యాలయ సముదాయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది మార్చిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి వివరించారు.

వివరాలు 

నిధుల విడుదలకు ఆర్థికశాఖ ఆమోదం

ఆ తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్‌ కూడా కేంద్రాన్ని ఈ అంశంలో ఫాలోఅప్ చేశారు. అన్ని అనుమతుల ప్రక్రియలు పూర్తి కావడంతో, ఆర్థికశాఖ మంగళవారం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మనోహర్‌లాల్ ఖట్టర్ ఆయా ఉత్తర్వులను మంత్రి పెమ్మసానికి అందజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ , ఖట్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన ట్వీట్