
Amit shah- Chandrababu:అమిత్ షాతో చంద్రబాబు భేటీ - ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి? రాజ్యసభకి బీజేపీ అభ్యర్థి ఖరారు?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రోజురోజుకీ పెరుగుతోంది. కూటమిగా కొనసాగుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చాటుకునే దిశగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి.
ఇందులో భాగంగా ఈసారి బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రీతిలో పావులు కదుపుతోంది.
త్వరలోనే పార్టీ జాతీయాధ్యక్షుడు తో పాటు రెండు రాష్ట్రాల యూనిట్లకు కొత్త అధ్యక్షులను నియమించనుందని సమాచారం.
అలాగే కేంద్ర మంత్రివర్గంలో విస్తరణ జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరికి కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశం కనిపిస్తోంది.
వివరాలు
ఢిల్లీకి చంద్రబాబు
ఇక రాజ్యసభ నుంచి పదవి విరమించిన వైసీపీ నేత సాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించబోతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవ్వనున్నారు.
ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబు రేపు మంగళవారం ఢిల్లీకి చేరుకుంటారు. మంగళవారం కేంద్ర మంత్రులతో ఆయన కీలక సమావేశాలు జరిపే అవకాశం ఉంది.
అమిత్ షాతో పాటు జలవనరుల శాఖ మంత్రి, న్యాయ శాఖ మంత్రులతో సీఎం సమావేశం కావచ్చని సమాచారం.
రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరగనున్నాయి.
మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి పర్యటనకు రావడంతో, ఈ ఢిల్లీ పర్యటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
వివరాలు
ఏపీ నుంచి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజ్యసభకు..
విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తరువాత ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సీటుకు తమ అభ్యర్థి ఎవరు అనే విషయంపై అమిత్ షా చంద్రబాబుకు స్పష్టత ఇచ్చే అవకాశముంది.
ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజ్యసభకు ఏపీ నుంచి నామినేట్ అవుతారని, అనంతరం ఆయనకు కేంద్ర మంత్రి పదవి కేటాయించనున్నారని వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా, ఈ అంశంపై చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
వివరాలు
టీడీపీకి మరో మంత్రి పదవి ఇస్తారా?
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు, బీజేపీకి చెందిన ఒకరు ఉన్నారు.
జనసేనకు ఇప్పటివరకు కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం దక్కలేదు. ఇప్పుడు విస్తరణ సందర్భంగా జనసేనకు అవకాశం ఇస్తారా? లేక టీడీపీకి మరో మంత్రి పదవి ఇస్తారా? అనే అంశం రాజకీయంగా కీలకంగా మారుతోంది.
అదే సమయంలో, అన్నామలైకి రాజ్యసభ సీటు ఖాయమైతే, ఆయనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని మరో ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిణామాలను ఉపయోగించుకొని బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి.