దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు కొసమేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో 2024లో జరిగే ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ- జనసేన పొత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు టీడీపీ- బీజేపీ పొత్తు ఉంటుందనే సంకేతాలను ఇస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం దేశ రాజధానికి చేరుకున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే జీ20 సంప్రదింపుల సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అయితే శనివారం దిల్లీకి చేరుకున్న వెంటనే చంద్రబాబు తన పార్టీ నాయకులు, ఎంపీలతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో కూడా సమావేశమయ్యారు. అయితే ఇద్దరు నేతలతో ఏపీ రాజకీయాలపై చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.
జూన్ 8న విశాఖకు అమిత్ షా, 10వ తేదీన తిరుపతికి నడ్డా
అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా వచ్చేవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. వీరి పర్యటన వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొనే సాగుతుందని తెలుస్తోంది. అమిత్ షా జూన్ 8న విశాఖకు రానుండగా, జేపీ నడ్డా 10న తిరుపతిలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించడంతోపాటు పలు కార్యక్రమాల్లో షా పాల్గొననున్నారు. మరోవైపు తిరుపతిలో పార్టీ కార్యక్రమాల్లో నడ్డా పాల్గొననున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా తొమ్మిదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేయడమే వారి పర్యటనల ఉద్దేశ్యం అయినప్పటికీ, భవిష్యత్ ఎన్నికల పొత్తులపై స్థానిక బీజేపీ నాయకత్వానికి వారు దిశానిర్దేశం చేస్తారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీతో పొత్తుకు పట్టుబడుతున్న జనసేన
ప్రస్తుతం ఏపీలో జనసేన- బీజేపీ కూటమిగా ఉన్నాయి. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీని కూడా కూటమిలో కలుపుకోవాలని బీజేపీపై ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో కలవడం బీజేపీ దిల్లీ నాయకత్వానికి ఇష్టం లేదని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డాను కలవడం, ఈ ఇద్దరు కీలక నాయకులు మళ్లీ వచ్చేవారం ఏపీకి రానుండటంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. అలాగే అమిత్ షా, నడ్డా పర్యనటలోనే బీజేపీ- టీడీపీ పొత్తుపై క్లారిటీ వస్తుందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.