Assembly Polls: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. మహారాష్ట్రలో బుధవారం ఉదయం నుంచి ఒకే విడతలో పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు 45 శాతం ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో మాత్రం రెండు విడతల పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 13న మొదటి విడతలో 43 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, బుధవారం మిగతా 38 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారిని ఎగ్జిట్ పోల్స్ డిబేట్స్‌లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం రాజకీయ చర్చలకు దారితీస్తోంది.
కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు
గతంలో లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌పై, ఆ సమయంలో బీజేపీ విమర్శలు గుప్పించింది. మహారాష్ట్రలో ఎన్డీఏ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తుండగా, ఇండియా కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పోటీ చేస్తోంది. జార్ఖండ్‌లోనూ అదే ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.